దేశం ముందు కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది

దేశం ముందు కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైంది
దేశ ప్రజల ముందు కాంగ్రెస్‌ మరోసారి నవ్వులపాలైందని, ఇండియా కూటమికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. రాహుల్‌గాంధీ విద్వేష ప్రచారం చేశారని, కులం, మతం పేరుతో ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేసినా మహారాష్ట్రలో బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన ప్రచారం, ఆయన పంపిన డబ్బులు మహారాష్ట్రలో పని చేయలేదని వ్యాఖ్యానించారు. 
 
మహారాష్ట్ర, ఝార్ఖండ్​ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజాతీర్పును ఉద్ధవ్‌ఠాక్రే వంచించారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమకు మహారాష్ట్ర ప్రజలు చక్కటి మెజార్టీ కట్టబెట్టారని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాష్ట్రాల్లో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఫలితాలు రాకముందే ఆ పార్టీ నేతలు విమానాలు సిద్ధం చేశారని ఎద్దేవా చేశారు. 
 
రాహుల్ గాంధీకి మతిమరపు పెరిగిపోయిందని, దేశంలో అనేక సంవత్సరాలు హస్తం పార్టీ అధికారంలో ఉన్న విషయాన్ని మరిచిపోయారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్​లో కాంగ్రెస్​కు 30 స్థానాలు కూడా రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.‘మహారాష్ట్రలో కాంగ్రెస్​ నాయకులు విష ప్రచారం చేశారు. ఆ పార్టీ మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. రేవంత్​రెడ్డి ఎన్నికల ప్రచారం పనిచేయలేదు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కోట్ల రూపాయలు వసూలు చేసి మహారాష్ట్రకు పంపించినా కూడా పని చేయలేదు’ అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 

గ్యారంటీలతో మోసం చేసిన కాంగ్రెస్​ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్​ ప్రదేశ్​లకే పరిమితమైందని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల్లో సొంతంగా 44 సీట్లు గెలిచిన కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకున్న తర్వాత కనీసం సగం సీట్లు కూడా సాధించలేకపోయిందని చెప్పారు. ఎమ్మెల్యేలను తెలంగాణ, కర్ణాటకకు తరలించాలని ప్లాన్​ చేశారని పేర్కొన్నారు. 

రాజకీయ అవకాశవాదం తలకెక్కిన ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కాంగ్రెస్​కు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని స్పష్టం చేశారు. ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ గెలవకపోతే ఈవీఏంల ట్యాంపరింగ్ జరిగినట్లా అని కిషన్​రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్​తో జతకట్టిన ఉద్ధవ్ ఠాక్రేకు ప్రజలు బుద్ధి చెప్పారని, మహారాష్ట్ర ప్రజలు వారసత్వాన్ని చూడలేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజీపీ ఓట్లు, సీట్లు సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. కేసీఆర్ పోవాలని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల వల్ల తెలంగాణలో అధికారంలోకి వచ్చారని చెప్పారు.