ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందన్న రష్యా

ప్రపంచ యుద్ధ స్వభావాన్ని సంతరించుకుందన్న రష్యా
పశ్చిమ దేశాలు అందచేస్తున్న దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌ ఉపయోగించడం వల్ల ఈయుద్ధం స్వభావమే మారిపోయిందని రష్యా అధినేత పుతిన్‌ హెచ్చరించారు. ఆయన క్రెమ్లిన్‌ నుండి జాతినుద్దేశించి టెలివిజన్‌లో ప్రసంగించిన  సందర్భంగా పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఉక్రెయిన్‌ భూభాగంపై కొత్త హైపర్‌సోనిక్‌ క్షిపణి వ్యవస్థ ‘ఒరెషిుక్‌’ ను గురిపెట్టామని ఆయన వెల్లడించారు. 

ఉద్రిక్తతలను అమెరికా రెచ్చగొడుతోందని విమర్శించారు. శాంతి చర్చలకు తాము సుముఖంగానే వున్నామని పునరుద్ఘాటించారు. ఒరెషిుక్‌ను అడ్డుకునే సామర్ధ్యం ఇంతవరకుఏ దేశానికీ లేదని పుతిన్‌ నొక్కి చెప్పారు. ఇటువంటి ఆయుధాలను ప్రతిఘటించే సాధనాల్లేవని చెప్పారు. ఈ క్షిపణితో ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పారిశ్రామిక సముదాయాల్లో ఒకదానిపై దాడి చేశామని చెప్పారు. 

అమెరికా, నాటో దేశాలు ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఉద్రిక్తతలను పెచ్చరిల్లేలా చేస్తున్నాయని పుతిన్‌ విమర్శించారు. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణా ఒప్పందాలను ధ్వంసం చేస్తూ, అంతర్జాతీయ భద్రతను తుడిచిపెడుతున్నారని అమెరికాపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ రష్యా శాంతి చర్చలకుసిద్ధంగానే వుందని పుతిన్‌ స్పష్టం చేశారు. 

శాంతియుత మార్గాల ద్వారా అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే రష్యా హెచ్చరికలను పశ్చిమ దేశాలు ముఖ్యంగా అమెరికా సీరియస్‌గా తీసుకోవాలని పుతిన్‌ పేర్కొన్నారు. రష్యాపై దాడి చేసే కచ్చితంగా సమాధానం చెప్పి తీరుతామని స్పష్టం చేశారు.

ఈ ఘర్షణ మరింత ఉధృతమైతే, ప్రతీకార చర్యలు చేపట్టే హక్కు రష్యాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇచ్చి, ఘర్షణను ఎగదోస్తున్న దేశాల్లోని సైనిక స్థావరాలపై దాడులకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణం అమెరికాయేనని పుతిన్‌ పునరుద్ఘాటించారు.

ఇదిలావుండగా, రష్యా కొత్త బ్యాలిస్టిక్‌ మిసైల్‌ను మోహరించిన నేపథ్యంలో, శుక్రవారం జరగవలసిన ఉక్రెయిన్‌ పార్లమెంటు సెషన్‌ రద్దయింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కార్యాలయం స్టాండర్డ్‌ సెక్యూరిటీ మెజర్స్‌ ప్రకారం కార్యకలాపాలను కొనసాగిస్తున్నది. తన కొత్త ప్రయోగాత్మక హైపర్‌సోనిక్‌ క్షిపణిని ఉక్రెయిన్‌పై ప్రయోగించినందుకు రష్యాపై చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాల నేతలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.

2024లో మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని ఉక్రెయిన్‌ మాజీ మిలిటరీ కమాండర్‌-ఇన్‌-చీఫ్‌ వలెరీ జలుజ్నీ చెప్పారు. ఉక్రెయిన్‌స్క యూపీ100 అవార్డ్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ యుద్ధంలో రష్యా నియంతృత్వ మిత్రులు పాల్గొంటున్నందువల్ల, ఇది అంతర్జాతీయ స్థాయికి విస్తరించిందని చెప్పవచ్చునని పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్‌ ముందు నిల్చుందని, ఇరానియన్‌ ‘షాహెదీస్‌’ బాహాటంగానే ఉక్రెయిన్‌ ప్రజలను చంపుతున్నారని తెలిపారు. చైనా ఆయుధాలు యుద్ధంలో కనిపిస్తున్నాయని చెప్పారు.