
సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది తన సిద్ధాంతమని, ఆ విధంగానే తాను సినీ పరిశ్రమలో పనిచేస్తానని ప్రముఖ సినీనటి ఖుష్బూ చెప్పారు. గోవాలోని పణజీలో భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ (ఇఫ్ఫీ) వేడుకగా జరుగుతోన్న వేళ తొలిరోజు జరిగిన వేడుకల్లో సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఖుష్బూ పాల్గొన్నారు.
‘సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ’ అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలకు అన్నిచోట్లా ఇబ్బందులు ఉన్నాయని, విషయం ఏదైనా నిర్ణయం మన చేతిలోనే ఉంటుందని చెప్పారు. ఒకానొక సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఖుష్బూ పంచుకున్నారు.
”గతంలో ఓ సినిమా సెట్‌లో ఒక హీరో నాతో ఇబ్బందికరంగా మాట్లాడాడు. నాకు ఏదైనా ఛాన్స్ ఉందా ? అన్నాడు. వెంటనే నేను నా చెప్పుల సైజు 41. ఇక్కడే చెంప పగలకొట్టనా? లేదా సెట్‌లో అందరి ముందు పగలకొట్టనా? అని అడిగా. సినిమా మాధ్యమంగా ప్రేక్షకులను అలరించాలని నేను పరిశ్రమలోకి వచ్చా. సమానత్వం, గౌరవంలో ఎక్కడా రాజీ పడకూడదనేది నా సిద్ధాంతం. ఆ విధంగానే పనిచేశా” అని ఆమె చెప్పారు.
హేమ కమిటీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చిన తర్వాత చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు బహిర్గతం అయ్యాయి. వారు ఎన్నోవిధాలా వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక తెలిపింది. మరోవైపు, ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీడియా ముందుకువచ్చి ధైర్యంగా చెబుతున్నారు.
ఈక్రమంలోనే సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని పలువురు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఈవిషయంపై ఇఫ్ఫీలో చర్చ జరగ్గా ఖుష్బూ , సుహాసిని, ఇంతియాజ్ అలీ పాల్గొని కీలక విషయాలు పంచుకున్నారు. తమకు నచ్చనిది జరుగుతున్నప్పుడు దానికి నో చెప్పడం తెలియాలని, ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలని వారు పిలుపునిచ్చారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు