31 ద్వైపాక్షిక భేటీలకు ప్రధాని హాజరైన ప్రధాని మోదీ

31 ద్వైపాక్షిక భేటీలకు ప్రధాని హాజరైన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 16 నుంచి 21 తేదీల్లో ఐదు రోజుల పాటు మూడు దేశాల్లో జరిపిన పర్యటనలో 31 ద్వైపాక్షిక భేటీలు, ప్రపంచ నేతలతో ఇష్టాగోష్ఠులలో పాల్గొన్నారని అధికారులు శుక్రవారం వెల్లడించారు. నైజీరియాలో ఆ దేశ అధ్యక్షుపితో ద్వైపాక్షిక సమావేశం. బ్రెజిల్‌లో జి20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పది ద్వైపాక్షిక సమావేశాలు, గయానాలో పర్యటన సమయంలో తొమ్మిది ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. 

బ్రెజిల్‌లో ఆ దేశ నేతలతో ద్వైపాక్షిక భేటీలతో పాటు. ఇండోనేషియా, పోర్చుగల్, ఇటలీ, నార్వే, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, చిలీ, అర్జెంటీనా, ఆస్ట్రేలియా అధినేతలతో కూడా మోడీ సమావేశం అయ్యారు. వాటిలో ఇండోనేషియా అధినేత ప్రబొవొ సుబియాంతో, పోర్చుగల్ నేత లూయి మాంటెనెగ్రో, యుకె ప్రధాని కైర్ స్టార్మర్, చిలీ నేత గాబ్రియెల్ బోరిక్, అర్జెంటీనా నేత జేవియర్ మిలీతో ప్రధాని మోదీ  మొదటిసారిగా ద్వైపాక్షిక సమావేశాలు జరిపారని అధికారులు వివరించారు.

బ్రెజిల్‌లో సింగపూర్, దక్షిణ కొరియా, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్, స్పెయిన్ నేతలతోను, యూరోపియన్ యూనియన్ నేత ఉర్సులా వాన్ డెర్ లెయెన్, ఐక్యరాజ్య సమితి (యుఎన్) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) అధిపతి టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్, ఐఎంఎఫ్‌కు చెందిన క్రిస్టలినీ జార్జీవా, గీతా గోపీనాథ్ వంటి వివిధ అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ఎగ్జిక్యూటివ్‌లతో కూడా మోడీ ఇష్టాగోష్ఠులు నిర్వహించారు.

గయానాలో గయానా, డొమినాకా, బహమాస్, ట్రినాడాడ్ టొబాగో, సురినామ్, బార్బడోస్. ఆంటిగ్వా బార్బుడా, గ్రెనడా, సెయింట్ లూషియా అధినేతలతో మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారని అధికారులు తెలియజేశారు. ప్రధాని మోదీని గయానా అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించగా నైజీరియా రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయడంతో ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది

గయానాతో పాటు ఇతర కరీబియన్ దేశాలతో భారత్‌కు చారిత్రిక, సాంస్కృతిక, వాణిజ్యం సంబంధాల బలోపేతం కోసం కృషి చేశారు. ముఖ్యంగా ఇంధన రంగం, విద్య, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు బార్బడాస్, ట్రినిడాడ్ అండ్ దేశాలతో భారత్ పలు ఒప్పందాలు కుదుర్చుకుంది.

అంతర్జాతీయంగా భారత పరపతి పెంచే దిశగా ఆయా దేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ప్రధాని మోదీ జరిపిన సమావేశాలు విజయవంతమయ్యాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారాలు కనుగొనడంలో భారత్ పూర్తిస్థాయిలో సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నదని ఐక్యరాజ్య సమితి, ప్రపంచఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి అధిపతులతో సమావేశాల సందర్భంగా మోదీ పేర్కొన్నారు.