
సంపన్న దేశాలు అందించాల్సిన వాతావరణ నిధి ప్యాకేజీ 2035 నాటికి ఏడాదికి 250 బిలియన్ల డాలర్లు చొప్పున వుండాలని కొత్త ముసాయిదా పేర్కొంటోంది. కాప్ 20 అధ్యక్ష వర్గం శుక్రవారం నాడు ఈ ముసాయిదాను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట వనరుల నుండి సేకరించే నిధులతో సహా 2035 కల్లా ఏటా 1.3లక్షల కోట్ల డాలర్ల మేరకు నిధులను సమీకరించడానికి విస్తృత లక్ష్యాన్ని కూడా ఈ ముసాయిదా నిర్దేశించింది.
కొత్త ముసాయిదా ఒప్పందం చాలా వ్యయభరితంగా వుందని యురోపియన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. నిధులు అందించే దేశాల సంఖ్యను పెంచడానికి తగిన రీతిలో కృషి చేయలేదని పేర్కొన్నారు. ”ఈ సంఖ్యతో ఎవరూ సంతృప్తిగా లేరు. ఎందుకంటే ఇది చాలా అధికంగా వుంది. పైగా నిధులు అందించే దేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు కూడా లేవు.” అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తుతున్న దుష్పభ్రావాలను ఎదుర్కొనడానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి నిరుపేద దేశాలకు సహాయపడేలా నిధుల సమీకరణ ప్రణాళికపై అంగీకారం కుదుర్చుకోవాలన్నది కాప్ 20 సదస్సు ప్రధాన లక్ష్యంగా వుంది. ఇందుకోసం ప్రపంచ నేతలు కాస్పియన్ సముద్ర నగరమైన బాకూలో సమావేశమై తీవ్ర స్థాయిలో చర్చలు జరిపారు.
శుక్రవారంతో ఈ సదస్సు ముగియాల్సి వుంది. అయితే, తుది ఒప్పందంపై తర్జన భర్జనలు కొనసాగేట్లయితే మరికొంత సమయం పొడిగించబడవచ్చునని భావిస్తున్నారు. అంతకు ముందు, వాతావరణ మార్పుల వల్ల తలెత్తుతున్న సంక్షోభాలను, విపత్తులను ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేయాలని భావిస్తున్న నూతన వాతావరణ నిధి ప్యాకేజీపై గురువారం తెల్లవారుజామున విడుదల చేసిన ముసాయిదాను ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రతి ఒక్క దేశమూ తిరస్కరించింది.
ఈ ముసాయిదా ఖరారుకు చాలా దూరంలో వుందని, తగు సూచనలు, సలహాలు అందజేయాల్సిందిగా అన్ని దేశాలను కోరామని కాప్29 అధ్యక్షవర్గం పేర్కొంది. ఏకాభిప్రాయం పొందే లక్ష్యంతో మరికొన్ని మార్పులు, చేర్పులు చేసి, సవరణలతో మరో కొత్త ముసాయిదాను రూపొందిస్తున్నామని ప్రకటించింది. రోజురోజుకు పెరుగుతున్న సవాళ్ల నేపథ్యంలో ఏటా కనీసం 1.3 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని వర్ధమాన దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.
2009లో ఇచ్చిన 100 బిలియన్ల డాలర్ల హామీ కంటే ఈ మొత్తం కనీసం 13 రెట్లు ఎక్కువ. సంపన్న దేశాలు ఇంకా అధికారికంగా మొత్తాన్ని ప్రతిపాదించనప్పటికీ ఆ మొత్తం ఏటా 200 బిలియన్ల నుండి 300 బిలియన్ల డాలర్ల వరకు వుండేలా చూసుకోవాలని యురోపియన్ యూనియన్ దేశాలు చర్చిస్తున్నట్లు చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు సూచనప్రాయంగా తెలిపారు.
More Stories
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో భారీ ప్రదర్శన
ఢాకా యూనివర్సిటీలో తొలిసారి ఇస్లామిస్ట్ ల విజయం
మార్చి 5న నేపాల్ పార్లమెంటరీ ఎన్నికలు