
కుకీ, మైతీ జాతుల మధ్య ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో మళ్లీ హింసాత్మక సంఘటనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మరో పది వేల మందికిపైగా సైనికులను అక్కడకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో కేంద్ర బలగాల మొత్తం కంపెనీల సంఖ్య 288కు చేరుతుందని పేర్కొంది.
మణిపూర్ భద్రతా సలహాదారుడు కుల్దీప్ సింగ్ శుక్రవారం రాజధాని ఇంఫాల్‌లో మీడియాతో మాట్లాడారు. 10,800 మంది కేంద్ర బలగాల సిబ్బందితో మరో 90 కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని కంపెనీల బలగాలు చేరాయని చెప్పారు. దీంతో మణిపూర్‌లో మోహరించిన మొత్తం కంపెనీల సంఖ్య 288కు పెరుగుతుందని వెల్లడించారు.
కాగా, పౌరుల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి ఉద్రిక్త ప్రాంతాలకు కేంద్ర బలగాలను తరలిస్తున్నట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు. కొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు ఇవి చేరుతాయని చెప్పారు. ప్రతి జిల్లాలో కొత్త కోఆర్డినేషన్ సెల్స్, జాయింట్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వాటి పనితీరును సమీక్షించినట్లు వెల్లడించారు.
గత ఏడాది మే నుండి చెలరేగిన హింసలో పౌరులు, ఉగ్రవాదులతో పాటు 258 మంది మృతి చెందారని తెలిపారు. ప్రజాప్రతినిధుల నివాసాలపై జరిగిన దాడులకు సంబంధించి 32 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. దాదాపు 3000 ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా, మణిపుర్‌లో వివిధ హింసాత్మక ఘటనల్లో హతులైన 9 మంది మృతదేహాల అప్పగింతపై కొద్ది రోజులుగా నెలకొన్న అనిశ్చితి శుక్రవారం తొలగిపోయింది.
శవపరీక్ష అనంతరం అస్సాంలోని సిల్చర్ వైద్య కళాశాల ఆస్పత్రి నుంచి మృతదేహాలను తీసుకెళ్లడానికి బాధిత కుటుంబాలు నిరాకరిస్తూ వచ్చాయి. న్యాయం జరిగే వరకూ మృతదేహాలు తీసుకెళ్లబోమంటూ భీష్మించగా ఎట్టకేలకు అధికారులు వారిని ఒప్పించారు.
దీంతో శుక్రవారం మృతదేహాలను మణిపుర్‌లోని జిరిబామ్‌కు తరలించారు. ఆ వెంటనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. మైతేయ్ వర్గానికి చెందిన తొమ్మిది మంది మృతుల్లో ఆరుగురు ఈ నెల 11న అపహరణకు గురైన మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల 11న హత్య చేశారు. ఇంకొకరు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారని చెబుతున్నారు.
ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)తో దర్యాప్తు జరిపించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 11 జిరిబామ్ జిల్లాలో సాయుధ బలగాల కాల్పుల్లో మృతి చెందిన 10 మంది కుకీలను మిలిటెంట్లుగా ప్రకటించాలని వారు పట్టుబట్టారు. ఈ పది మంది కుకీల మృతదేహాలను ఈ నెల 16న చురాచాంద్‌పుర్‌కు తరలించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్