ఖండాంతర బాలిస్టిక్‌ క్షిప‌ణి ప్ర‌యోగించిన ర‌ష్యా

ఖండాంతర బాలిస్టిక్‌ క్షిప‌ణి ప్ర‌యోగించిన ర‌ష్యా
రష్యా, ఉక్రెయిన్ ల మ‌ధ్య యుద్ధం వెయ్యి రోజులు దాటినా తర్వాత తొలిసారి ర‌ష్యా త‌న వ‌ద్ద ఉన్న ఖండాంత‌ర బాలిస్టిక్‌ క్షిప‌ణిని (ఐసిబిఎం) ప్ర‌యోగించిన‌ట్లు  ఉక్రెయిన్ పేర్కొన్న‌ది. గురువారం ఉద‌యం ఆ అటాక్ జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ వైమానిక ద‌ళం వెల్ల‌డించింది. ఉక్రెయిన్‌తో జ‌రుగుతున్న యుద్ధంలో తొలిసారి ఆ వెప‌న్ వాడారు. 
 
అయితే ఎటువంటి ఖండాంత‌ర క్షిప‌ణిని వాడార‌న్న విష‌యాన్ని మాత్రం ఉక్రెయిన్ స్ప‌ష్టం చేయ‌లేదు. ఆ క్షిప‌ణి వ‌ల్ల జ‌రిగిన న‌ష్టం గురించి కూడా ఉక్రెయిన్ ప్ర‌క‌టించ‌లేదు. రెండు రోజుల క్రితం బ్రిట‌న్ స‌ర‌ఫ‌రా చేసిన లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్షిప‌ణుల‌ను ర‌ష్యాపై ఉక్రెయిన్ ప్ర‌యోగించిన నేప‌థ్యంలో తాజా అటాక్ జ‌రిగి ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్‌పై ఉదయం చేసిన దాడిలో రష్యా తన దక్షిణ ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుండి ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని కీవ్ వైమానిక దళం తెలిపింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యా ఇంత సుదూర, శక్తివంతమైన క్షిపణిని ఉపయోగించడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ పేర్కొంది. అనేక ర‌కాల మిస్సైళ్ల‌తో డిప్రోను టార్గెట్ చేసిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

ఖండాంత‌ర క్షిప‌ణ‌లు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌వు. అత్య‌ధికంగా ఆ మిస్సైళ్లు 5వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణిస్తాయి. అయితే తాజా అటాక్ స‌మ‌యంలో ఆరు కేహెచ్‌-101 క్రూయిజ్ మిస్సైళ్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఉక్రెయిన్ మిలిట‌రీ పేర్కొన్న‌ది. డిప్రో సిటీపై జ‌రిగిన దాడిలో భారీ న‌ష్టం సంభ‌వించింది. ప‌లు భ‌వ‌నాలు కూలిపోయాయి. అనేక మంది గాయ‌ప‌డ్డారు. బ్రిట‌న్‌కు చెందిన రెండు స్టార్మ్ షాడో మిస్సైళ్ల‌ను కూల్చివేసిన‌ట్లు ఇవాళ ర‌ష్యా మిలిట‌రీ ప్ర‌క‌టించింది.

జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉక్రెయిన్‌కు యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్‌ల ఏర్పాటును ఆమోదించిన తర్వాత, వ్లోదిమీర్ జెలెన్స్కీ ఒక వీడియోలో యుఎస్‌కి కృతజ్ఞతలు తెలిపారు, ల్యాండ్‌మైన్‌లు “రష్యన్ దాడులను ఆపడానికి… అత్యవసరం…” అని ‘ది గార్డియన్’ నివేదించింది. అంతకుముందు, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ మాట్లాడుతూ, మారుతున్న రష్యా వ్యూహాలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ కోసం యాంటీ పర్సనల్ ల్యాండ్‌మైన్‌లపై వాషింగ్టన్ విధానంలో మార్పు అవసరమని పేర్కొన్నారు.