నిజ్జర్ హత్య వెనుక భారత ప్రధాని మోదీతోపాటు పలువురు ప్రముఖుల హస్తం ఉన్నదని కెనడాకు చెందిన భద్రతా సంస్థలు ఆరోపించాయని ఆ దేశ దినపత్రిక ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు అంతంత మాత్రం ఉండగా, ఈ వార్తా కథనం దానికి మరింత ఆజ్యం పోసినట్లైంది.
ఈ కథనాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ వార్తాకథనం హాస్యాస్పదం అంటూ తోసిపుచ్చింది. భారత్ ఆగ్రహంతో తాజాగా కెనడా వెనక్కి తగ్గింది. న్యూఢిల్లీ ఆగ్రహంతో దిగొచ్చిన కెనడా ప్రభుత్వం.. మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసింది. నిజ్జర్ హత్య కేసు కుట్రలో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లను తాము ఎన్నడూ ప్రస్తావించలేదని పేర్కొంది.
వార్తాపత్రికలో వచ్చిన కథనాలు అవాస్తవమేనంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో భారతీయ అధికారులను నేరుగా దోషులుగా చూపే ఎలాంటి ఆధారాలు తమ వద్ద లేవని ఒట్టావా స్పష్టం చేసింది. దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన అవన్నీ ఊహాజనితం, అవాస్తవమేనని ట్రూడో సర్కార్ తమ ప్రకటనలో వెల్లడించింది.
కెనడా పత్రిక కథనం ప్రకారం.. నిజ్జర్ హత్యకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కుట్ర పన్నారని, ఈ విషయాన్ని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చారని కెనడా జాతీయ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. భారత ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మధ్య చర్చలు జరిగిన తరువాతనే నిజ్జర్ హత్య చోటుచేసుకున్నట్టు కెనడా భద్రతా సంస్థలు భావిస్తున్నాయని ఆ అధికారి పేర్కొన్నారు. నిజ్జర్ హత్యలో మోదీతోపాటు జైశంకర్, అజిత్ దోవల్ పాత్ర ఉన్నట్టు ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి.
ప్రధాని మోదీకి తెలియకుండా ఓ పరాయి దేశంలో ముగ్గురు సీనియర్ రాజకీయ ప్రముఖులు హత్యకు కుట్ర చేశారనుకోవడం నమ్మశక్యం కానిదని ఆ భద్రతా అధికారి అభిప్రాయపడ్డారు. నిజ్జర్ హత్య వెనుక మాస్టర్ మైండ్ అమిత్‌షాదేనని అటు అమెరికా, ఇటు కెనడా ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చినట్టు ఆ అధికారి తెలిపారు.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ