కాగ్‌ అధిపతిగా సంజయ్‌మూర్తి ప్రమాణం

కాగ్‌ అధిపతిగా సంజయ్‌మూర్తి ప్రమాణం
* తొలి తెలుగు వ్యక్తిగా అరుదైన ఘనత

ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు. కాగ్‌ అధిపతిగా ప్రమాణస్వీకారం చేశారు. డిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు.

అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్‌ మూర్తి కుమారుడు కొండ్రు సంజయ్‌మూర్తి. 1964 డిసెంబరు 24వ తేదీన జన్మించిన సంజయ్‌మూర్తి, మెకానికల్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ చదివారు. 1989లో ఐఏఎస్‌ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్‌ కేడర్‌కు ఎంపికై, అనంతరం కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 

2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్‌ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సిఉండగా, సంజయ్‌ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలు అప్పగించింది. 

ఉపరాష్ట్రపతి జగదేవ్ దనఖర్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.

ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరు సంవత్సరాలు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్‌ఆర్‌ మూర్తి 1996లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్‌ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలు అందించారు.