
చదువుల కోసం అమెరికా బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2023-24లో యూఎస్ యూనివర్సిటీల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య చైనాను దాటిపోయింది. దీంతో యూఎస్ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థుల పరంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ డేటా ప్రకారం, గత సంవత్సరం యూఎస్ వెళ్లిన భారతీయ విద్యార్థులలో దాదాపు 56 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. వీరిలో 34% తెలంగాణ, 22% ఆంధ్రా విద్యార్థులు ఉన్నారు. ఇక భారతీయ విద్యాసంస్థల్లో చేరిన యూఎస్ విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే 300 శాతం పెరిగింది.
ఈ వివరాలను హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్, మరో అధికారి అలెగ్జాండర్ మెక్లారెన్ విశాఖ పర్యటనలో మీడియాకు తెలిపారు. 2023లో భారతదేశం నుంచి దాదాపు 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికాకు ఉన్నత చదువుల కోసం వెళ్లగా, వీరిలో దాదాపు 1.8 లక్షలు ఏపీ, తెలంగాణ విద్యార్థులు ఉండవచ్చని పేర్కొన్నారు.
భారతదేశంలో యూఎస్ వీసాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతోందని యూఎస్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. గత సంవత్సరం 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశామని చెప్పారు. దేశంలోని మరే ఇతర కాన్సులేట్ ఇన్ని వీసాలు ప్రాసెస్ చేయలేదని స్పష్టం చేశారు. గత ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ సిబ్బంది రెండింతలు పెరిగారని తెలిపారు.
2025 నాటికి వీరి సంఖ్య మూడు రెట్లు అవుతుందని భావిస్తున్నారు. తాము రోజుకు 1,600 వీసాలను ప్రాసెస్ చేస్తామని, ఈ సంఖ్య 2025 జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దాదాపు 2,500కి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్ కాన్సులేట్ 2024 సమ్మర్ స్టూడెంట్ వీసా సీజన్లో 47,000 స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇది 2023లో 35,000లుగా ఉంది. ఈ ఏడాది అమెరికాకు విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. భారతీయ విద్యార్థులు తమ మాస్టర్స్ డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం యూఎస్ వెళ్తున్నారని వివరించారు.
యూఎస్ లో నివసిస్తున్న వారికోసం హెచ్-1బి దేశీయ రీవాలిడేషన్ పైలెట్ ప్రోగ్రామ్ అమలుచేశామన్నారు. ఇందులో హెచ్-1బి హోల్డర్ల కోసం గత మూడు నెలల పాటు 10,000 అపాయింట్మెంట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. దీంతో యూఎస్ ఉంటున్న భారతీయులు దేశానికి తిరిగి రాకుండానే వారి వీసాలను పునరుద్ధరించుకోవచ్చని పేర్కొన్నారు. ఇది పైలెట్ ప్రోగ్రామ్ విజయవంతమైందని యూఎస్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది దీనిని సాధారణ కార్యక్రమంగా పునరుద్ధరించే అవకాశం ఉందని చెప్పారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు