యుపిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన ఏడుగురు పోలీసులు సస్పెండ్‌

యుపిలో మార్గదర్శకాలు ఉల్లంఘించిన ఏడుగురు పోలీసులు సస్పెండ్‌

* జార్ఖండ్‌లో 5 ట్ర‌క్కుల‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు

ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఓటర్ గుర్తింపు కార్డుల తనిఖీలకు సంబంధించి బుధవారంనాడు తలెత్తిన వివాదంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపించింది. సమాజ్‌వాదీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల మార్గదర్శకాల ఉల్లంఘనకు పాల్పడిన ఏడుగురు పోలీసులను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలిచ్చింది.
 
సస్పెండైన వారిలో కాన్పూర్, ముజఫర్‌నగర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు అధికారులు, మొరాదాబాద్‌ నుంచి ముగ్గురు అధికారులు ఉన్నారు. “అర్హత కలిగిన ఓ ఒక్కరిని ఓటు వేయకుండా అడ్డుకోరాదు. ఓటింగ్ సమయంలో ఎలాంటి వివక్షను సహించేది లేదు. ఫిర్యాదు అందితే వెంటనే విచారణ ఉంటుంది. దోషిగా తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి” అని ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
 
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి, ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులను ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఫిర్యాదులు అందిన తక్షణమే చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చర్యలను ఫిర్యాదుదారుని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో తెలియజేయాలని కూడా ఆయన ఆదేశాలు ఇచ్చారు. 
 
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్, కతెహారి, ఖైర్, కుందర్కి, కర్హాల్, మజవాన్, మీరాపూర్, ఫుల్పూర్, సిషామౌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.  పోలీసు అధికారులు చట్టవిరుద్ధంగా ఓటర్ కార్డులు, ఆథార్ కార్డులు తనిఖీ చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈసీకి ఫిర్యాదు చేశారు. 
 
కొన్ని కమ్యూనిటీలను ఓటు వేయకుండా నిరోధిస్తున్నారని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, చాలాచోట్ల తాము ఫిర్యాదులు చేశామని, ఏమి చేసైనా సరే నెగ్గాలని బీజేపీ కోరుకుంటోందని, అధికార యంత్రాగంపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.
 
కాగా, జార్ఖండ్‌లో రెండో ద‌శ అసెంబ్లీ పోలింగ్ కు ముందే మావోయిస్టులు అయిదు ట్ర‌క్కుల‌కు నిప్పు పెట్టారు. ల‌తేహ‌ర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెరాంజ్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న లాత్ అట‌వీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాల‌కు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పోలీసులు చెప్పారు. ల‌తేహ‌ర్‌లో బొగ్గు ప్రాజెక్టు వ‌ద్ద ర‌వాణా కోసం వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు.
బొగ్గును ఖాళీ చేసి తిరిగి వ‌స్తున్న ట్ర‌క్కుల‌కు నిషేధిత జార్ఖండ్ ప్ర‌స్తుతి క‌మిటీ నిప్పు పెట్టిన‌ట్లు తెలిసింది. ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించారు. వాహ‌నాల‌ను ద‌గ్దం చేసిన కేసులో త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు ఎస్పీ కుమార్ గౌర‌వ్ తెలిపారు. సంఘ‌ట‌నా స్థ‌లం వ‌ద్ద క‌ర‌ప‌త్రాల‌ను వ‌ద‌లి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వ‌ద్ద ప‌నులు సాగాలంటే త‌మ‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆ క‌ర‌ప‌త్రంలో మావోయిస్టులు పేర్కొన్న‌ట్లు ఎస్పీ తెలిపారు.