
రుతుపవనాల మార్పు (నైరుతి రుతుపవనాలు తూర్పు నుండి పడమరవైపుకి మారడం)తో సాధారణంగా పొడిగా వుండే పశ్చిమ రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని, మరోవైపు తూర్పు ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉంటుందని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీ తెలిపింది. ఈ మార్పులు ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయ ఉత్పాదకతలను దెబ్బతీస్తాయని పేర్కొంది.
గుజరాత్, రాజస్థాన్‌లలో 1960తో పోలిస్తే 2021-24 మధ్య కాలంలో మధ్యస్థ ఉద్గారాల పరిస్థితుల్లో 40 శాతం, అధిక ఉద్గారాల పరిస్థితుల్లో 50 శాతం వరకు వర్షపాతం గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. ఇది మరింత వరదలు, భూమి కోతకు దారితీస్తుందని, వ్యవసాయ ఉత్పాదకత తగ్గుతుందని తెలిపింది.
కాశ్మీర్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన హిమాలయాల్లో ఈశాన్య రుతుపవనాల సమయంలో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రాంతాల్లో 15 శాతం తక్కువ వర్షపాతం రికార్డవుతుంది.
అయితే గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 20 శాతం నుండి 60 శాతం వరకు ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, గుజరాత్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ కనులమ వంటి ఎత్తైన ప్రాంతాల్లో భారీ వర్షపాతంతో వేగంగా మంచుకరగడం, కొండచరియలు విరిగిపడటం అధికమౌతాయి. దీంతో స్థానిక పంటలకు, ఆర్థికవ్యవస్థలకు తీవ్రనష్టం వాటిల్లుతుందని అంచనావేసింది.
ఈ శతాబ్దం మధ్యనాటికి భారతదేశంలో వార్షిక సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్ పెరగవచ్చని, అధిక ఉద్గారాల పరిస్థితుల్లో మరింత వేగంగా పెరగవచ్చని డేటా చూపింది. హిమాలయాల్లోని లేహ్ జిల్లాల్లో 1.8డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్‌లో శీతాకాలంలో కూడా 2.2 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కవచ్చు.
ఇది 8 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య పెరిగే పంటలపై తీవ్రప్రభావం చూపుతుంది. తీరప్రాంతాలు, తూర్పు హిమాలయ భాగాలు తేమతో కూడిన ఉష్ణోగ్రతల్లో (31 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ) ప్రమాదకరమైన పెరుగుదల ఉండవచ్చని తెలిపింది. ఆరోగ్యం, కార్మిక ఉత్పాదకతపై గణనీయమైన ప్రభావం ఉండవచ్చని తెలిపింది.
అజర్బైజాన్లో జరిగిన యుఎన్ వాతావరణ సదస్సులో అభివృద్ధి చెందుతున్న దేశాలు కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, వాతావరణ మార్పులకు అనుగుణంగా దేశాల నుండి ట్రిలియన్ డాలర్లను సేకరించేందుకు మార్గాలను అన్వేషిస్తున్న సమయంలో ఈ నివేదిక వెలువడింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్