ఘన వ్యర్థాల నిర్వహణకు 2016 నిబంధనలు అమలు చేయాల్సిందే

ఘన వ్యర్థాల నిర్వహణకు 2016 నిబంధనలు అమలు చేయాల్సిందే
దేశ రాజధాని ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2016 అమలులో ప్రభుత్వ ఏజెన్సీలన్నీ విఫలమయ్యాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్టేక్ హోల్డర్లందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై చర్చించాలని సీఎస్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. 
 
ఢిల్లీలో 2016 నాటి నిబంధనలు సక్రమంగా అమలు చేయడం కీలకమని చెప్పింది. జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్తీన్‌ జార్జ్‌ మసీహ్‌ ధర్మాసనం ఈ నెల 11న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అధికారులంతారూ సమస్య పరిష్కారంపై ఏకతాటిపైకి రాలేదని.. 2016 నాటి ఆదేశాల అమలుకు సంబంధించి గడువును చెప్పకపోతే.. తామే కఠినమైన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
నిబంధనలకు అనుగుణంగా కోర్టుకు నివేదిక సమర్పించాలని స్టేక్‌ హోల్డర్లను కోర్టు ఆదేశించింది. సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలను చెప్పేందుకు డిసెంబర్‌ 13 వరకు గడువు విధించింది. ఇతర కేసుల్లో మాదిరిగానే నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొంది. ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో నిబంధనలు అమలు చేయడంలో విఫలమైతే దేశంలోని ఇతర నగరాల్లో ఏం జరుగుతుందో ఊవహించవచ్చని చెప్పింది. 
 
ఈ అంశంపై విచారణను డిసెంబర్‌ 16వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణ అంశం ప్రస్తావనకు వచ్చింది. 2026 నాటికి దేశ రాజధానిలో ప్రతిరోజూ ఉత్పత్తి అయ్యే 11,000 టన్నుల ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని మించిపోతుందని ఢిల్లీ ఎండీసీ అక్టోబర్ 18న సుప్రీంకోర్టుకు తెలిపింది. 
 
జూలై 26న దేశ రాజధానిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను సరిగ్గా అమలు చేయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో ప్రతిరోజూ 3వేల టన్నులకు పైగా ఘన వ్యర్థాలు శుద్ధి కాకుండా మిగిలిపోతున్నాయని.. ఇది ప్రజారోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. దేశ రాజధానిలో రోజుకు 11,000 టన్నులకు పైగా ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుండగా, ప్రాసెసింగ్ ప్లాంట్ల రోజువారీ సామర్థ్యం 8,073 టన్నులు ఉందంటూ సుప్రీం కోర్టు ఎండీని మందలించింది.