హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

హైపర్‌ సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

భారత సైన్యం అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది డీఆర్​డీఓ. శనివారం ఒడిశాలోని అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి డీఆర్​డీఓ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్‌ సోనిక్‌ క్షిపణులున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు.

వివిధ రకాల వార్‌హెడ్‌లను అమర్చేలా క్షిపణిని డిజైన్‌ చేశామని వెల్లడించారు. ఇక ఈ పరీక్ష సైనిక దళాలకు చెందిన కీలక అధికారులు, శాస్త్రవేత్తల సమక్షంలో జరిగింది. క్షిపణి గమనాన్ని వివిధ వేదికల నుంచి జాగ్రత్తగా ట్రాక్‌ చేసినట్లు, చివరి దశలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొన్నట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ మిసైల్‌ కాంప్లెక్స్‌లో క్షిపణిని రూపొందించిగా, దేశంలోని ఇతర డీఆర్​డీఓ ల్యాబ్‌లు, పరిశ్రమలు సహకరించాయి.

దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడం వల్ల భారత్‌ ఓ పెద్ద మైలురాయిని దాటిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్‌ చేరిందని పేర్కొన్నారు. 

క్షిపణిని తయారీలో భాగస్వామ్యమైన డీఆర్​డీఓ శాస్త్రవేత్తలను రాజ్‌నాథ్‌ సింగ్ అభినందించారు. అంతే కాకుండా పరీక్షకు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్​ చేశారు. శబ్ద వేగానికి ఐదు రెట్ల కంటే అధిక వేగంతో ఈ హైపర్ సోనిక్ క్షిపణి ప్రయాణించగలదు. అంటే సుమారు గంటకు ఇది 6,200 కిలోమీటర్లకు పైగా వేగం. 

దీనికి ఘన ఇంధన ఇంజిన్‌ అమర్చి ఉండటం వల్ల దాదాపు 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి రాకెట్‌ ఇంజిన్‌ విడిపోతుంది. దీనికి అమర్చిన గ్లైడ్‌ వెహికల్‌ లక్ష్యం దిశాగా దూసుకుపోతుంది. అదే ఖండాంతర క్షిపణులు అయితే, భూమి నుంచి చాలా ఎత్తుకు వెళ్లి బాలిస్టిక్‌ గమనంలో లక్ష్యంపై పడతాయి. 

వీటిని రాడార్లు ట్రాక్‌ చేయడం తేలిక. కానీ, హైపర్‌ సోనిక్‌ క్షిపణి పూర్తి భిన్నం. ఇది రాడార్‌ పరిధిలోకి వచ్చేసరికే శత్రువు స్పందించడానికి అతి స్వల్ప సమయం ఉంటుంది. దీంతో లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదించేస్తుంది.