
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మరణించిన పిల్లలు ఆ సమయంలో ఇంక్యుబేటర్లలో ఉన్నారని కాన్పూర్ జోన్ ఏడీజీ అలోక్ సింగ్ వెల్లడించారు. ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఘటన సమయంలో వార్డులో మొత్తం 47 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఝాన్సీ డీఐజీ కళానిధి నైతానీ మృతులంతా చిన్నారులేనని, మరో 16 మంది గాయపడ్డారని వివరించారు.
ఝాన్సీ జిల్లా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య ఎన్ఐసీయూ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయని తెలిపారు. యూనిట్ బయట ఉన్న పిల్లలను సిబ్బంది కాపాడినట్టు స్పష్టం చేశారు.
“లోపల ఉన్న వారిలో చాలా మందిని రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు, ఇప్పటివరకు 10 మంది పిల్లలు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం వెంటనే స్పందించి పలువురు చిన్నారులను కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని డ్యూటీ సిబ్బంది చెబుతున్నారు,” అని తెలిపారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఝాన్సీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీ ఎన్ఐసీయూలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని సీఎం యోగి అన్నారు.
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఝాన్సీకి పంపి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్, డీఐజీలను సీఎం యోగి ఆదేశించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్