చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి

చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. మహారాష్ట్ర పర్యటనను కూడా రద్దు చేసుకొని చంద్రబాబు హైదరాబాద్ వస్తున్నారు.

శనివారం ఉదయం రామ్మూర్తినాయుడి ఆరోగ్యం విషమంగా ఉందని లోకేష్‌కు సమాచారం వచ్చింది. దీంతో అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరారు నారా లోకేష్‌. ఏఐజీ ఆసుపత్రిలో నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులను నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి పరామర్శించారు.

హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు తన సోదరుడి మరణవార్త తెలియగానే పర్యటనను రద్దు చేసుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఆదివారం ఉదయం స్వగ్రామం నారావారిపల్లెలోనే రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

కాగా రామ్మూర్తి నాయుడు గతంలో 1994 నుంచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 1999 అసెంబ్లీ ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

చంద్రబాబు తమ్ముడు, హీరో నారా రోహిత్ తండ్రే నారా రామ్మూర్తినాయుడు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. శనివారం రామ్మూర్తినాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

రామ్మూర్తినాయుడు కుమారుడే హీరో నారా రోహిత్‌. ఆయనకు ఇటీవలే ప్రతినిధి 2 హీరోయిన్‌ శిరీషతో ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు, ఇరు కుటుంబాల పెద్దలతోపాటు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. త్వరలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. అయితే.. రామ్మూర్తి నాయుడు మృతితో  రోహిత్ వివాహం వాయిదాపడే అవకాశం ఉంది.