భారత్ లో ప్రపంచం షుగర్ కేసులలో నాలుగోవంతు

భారత్ లో ప్రపంచం షుగర్ కేసులలో నాలుగోవంతు

2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 82.8 కోట్లమందికి పైగా డయాబెటిస్‌ (షుగర్‌) బారినపడినట్లు అంచనా. భారతదేశంలో నాలుగోవంతు జనాభా ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ‘నవంబర్‌ 14న ప్రపంచ డయాబెటిస్‌ డే’ సందర్భంగా ఓ అధ్యయనం లాన్సెట్‌ నివేదికలో ప్రచురితమైంది.

82.8కోట్ల సంఖ్య 1990లో డయాబెటిస్‌ బాధితుల సంఖ్యకు నాలుగు రెట్లు ఉందని, ముఖ్యంగా చిన్న, మధ్యస్థ ఆదాయ దేశాల(ఎల్‌ఎంఐసి)లో అత్యంత పెరుగుదల ఉన్నట్లు నివేదిక తెలిపింది. 1990-2022 మధ్య, ఎల్‌ఎంఐసిలలో చాలా తక్కువస్థాయిలో షుగర్‌ చికిత్స రేట్లు ఉన్నాయి.

 ప్రపంచవ్యాప్తంగా (సుమారు 60 శాతం) జీవన క్రియ పరిస్థితితో 30 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 44.5 కోట్ల మంది పెద్దలు 2022లో చికిత్స తీసుకోకపోవడంతో షుగర్‌ కేసులు పెరిగినట్లు నివేదిక తెలిపింది. చికిత్స తీసుకోని 44.5 కోట్లలో మూడింట ఒక వంతు (13.3 కోట్లు) భారత్‌లోనే ఉన్నట్లు పేర్కొంది.

చైనాలో 14.8 కోట్ల మంంది ఉండగా, అమెరికాలో 4.2 కోట్లు, పాకిస్థాన్‌లో 3.6 కోట్లు, బ్రెజిల్‌లో 2.2 కోట్ల మంది ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీస్‌ రిస్క్‌ ఫ్యాక్టర్‌ కొలాబరేషన్‌ (ఎన్‌సిడి-రిస్క్‌) సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ)తో సమన్వయమై ఈ అధ్యయనం చేపట్టింది. 

ఎన్‌సిడి రిస్క్‌ సంస్థలో 1500 మందికి పైగా పరిశోధకులు, అభ్యాసకులు ఉన్నారు. వీరు పలు దేశాలలో వ్యాప్తి కాని వ్యాధికి గల ప్రమాద కారకాలపై సమాచారాన్ని అందిస్తుంటారు.