కర్ణాటకలో నీటి బిల్లులపై హరిత సుంకం!

కర్ణాటకలో నీటి బిల్లులపై హరిత సుంకం!
 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధపడుతున్నది. పశ్చిమ కనుమ నదీ జలాలను వినియోగించే నగరవాసుల నీటి బిల్లులపై త్వరలో హరిత సుంకం(సెస్‌)ను విధించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ హరిత సెస్‌కు సంబంధించిన ముసాయిదా ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్‌ ఖాండ్రే ఆ శాఖ అదనపు చీఫ్‌ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. 
 
పశ్చిమ కనుమల పరిరక్షణకే ఈ సెస్‌ను విధించాలని యోచిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఒక్కో నీటి బిల్లు నుంచి రెండు మూడు రూపాయలు వసూలు చేస్తే ప్రజలకు పశ్చిన కనుమల ప్రాధాన్యత తెలియడంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ నిధులను మొక్కల పెంపకం, అటవీ అంచున ఉండే వ్యవసాయ భూమిని స్వచ్ఛందంగా అమ్మే రైతుల నుంచి కొనుగోలుకు, పశ్చిమ కనుమల పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసే జంతు కారిడార్‌కు, అడవుల, జంతువుల పరిరక్షణకు ఏర్పాటు చేసే బ్యారికేడ్ల ఏర్పాటుకు వాడతామని చెప్పారు.

నీటి బిల్లులకు హరిత సెస్‌ విధింపు యోచనపై విపక్ష బీజేపీ మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దివాలాకోరుతనానికి ఇది నిదర్శనమని, ఇదంతా ఉచిత గ్యారంటీల మహిమ అని ఆ పార్టీ ఎమ్మెల్యే మహేశ్‌ టెంగింకై విమర్శించారు. ప్రభుత్వం పశ్చిమ కనుమలను పరిరక్షించాలనుకుంటే కేంద్రాన్ని నిధులు అడగాలి తప్ప, ఇలా ప్రజలపై భారం వేయడం తగదని హితవు చెప్పారు. 

అయితే హరిత సెస్‌ విధింపు ఎంతమాత్రం నిజం కాదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. ఇది కేవలం బీజేపీ చేస్తున్న ప్రచారమేనని, నీటి పన్నుపై తాము ఎలాంటి అదనపు సెస్‌ విధించడం లేదని తెలిపారు.

మరోవంక, చేతనైతే తనను పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించాలని విపక్ష బీజేపీకి కర్ణాటక కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్‌ విసిరారు.  కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నదని, అలాంటి కుటిల ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తే ప్రజలు ప్రశాంతంగా చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

అయితే, కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఒక్కో ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.50 కోట్లు లంచమిచ్చినట్టు చేసిన వ్యాఖ్యల మూలాలను వెల్లడించాలని, తన ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిరూపించుకోవాలని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రికి తన సొంత ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదని, అందుకనే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 

ముఖ్యమంత్రి తన ఆరోపణలను నిరూపించకుంటే ఇకపై ఆయన మాటలను ప్రజలు విశ్వసించబోరని విమర్శించారు. అయితే విజయేంద్ర సవాల్‌పై స్పందించేందుకు సిద్ధరామయ్య నిరాకరించారు. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఎందుకు అడుగుతున్నారని విలేకరులను ఎదురు ప్రశ్నించారు.

కాగా, ముడా కుంభకోణం కేసులో విచారణకు మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) మాజీ చైర్మన్‌ కే మరిగౌడ గురువారం ఈడీ ముందు హాజరయ్యారు. ముడా చైర్మన్‌గా ఉన్న మరిగౌడ వ్యక్తిగత కారణాలతో గత నెలలో పదవికి రాజీనామా చేశారు.