ఆ కుటుంబం దేశాన్ని పాలించడానికే పుట్టామనుకుంటోంది

ఆ కుటుంబం దేశాన్ని పాలించడానికే పుట్టామనుకుంటోంది

దేశాన్ని పాలించడానికే తాము పుట్టామని కాంగ్రెస్ రాయల్​ ఫ్యామిలీ (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తోందని, ఆ పార్టీ మనస్తత్వం అదే అని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీల అభివృద్ధి కుంటుపడడానికి కాంగ్రెస్ కారణం అని ఆరోపించారు. రిజర్వేషన్లు అంటేనే కాంగ్రెస్ చిరాకు పడుతోందని మండిపడ్డారు. 

1980 దశకంలో రాజీవ్ గాంధీ పార్టీకి నాయకత్వం వహించినప్పుడు దళితులు, ఆదివాసీలు అనుభవిస్తున్న ప్రత్యేక హక్కులను ప్రశ్నిస్తూ ఓ ప్రకటన ప్రచురించారని ప్రధాని గుర్తుచేశారు. దాన్ని సోషల్​ మీడియాలో షేర్​ చేశారని, ఇది ఆ పార్టీ రిజర్వేషన్​ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తోందని మోదీ ధ్వజమెత్తారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రాపుర్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

“దేశాన్ని విచ్ఛిన్న చేయడానికి కాంగ్రెస్ ఆడుతున్న డేంజరెస్ గేమ్. ఒకవేళ ఆదివాసీలు కులాలుగా విడిపోతే వారి గుర్తుంపు, ఐక్యత విచ్ఛిన్నమవుతాయి. కాంగ్రెస్ యువరాజు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించారు. అందుకే కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రను మనం బలి కాకూడదు. మనం ఐక్యంగా ఉండాలి. మహావికాస్​ అఘాడీ(ఎమ్​వీఏ) అతి పెద్ద అవినీతి కూటమి. రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డుపడుతోంది” అంటూ ప్రధాని మండిపడ్డారు.

అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్‌ డబుల్ పీహెచ్‌డీ చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్‌ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందని తెలిపారు.  భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మహారాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. 

మహారాష్ట్రలోని మహాయుతి కూటమి, కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే కూటమితో కలిసి రెట్టింపు స్పీడుతో మహారాష్ట్రను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని హామీ ఇచ్చారు. గత 2.5 ఏళ్లలో డబుల్ స్పీడ్ డవలప్‌మెంట్‌ను ప్రజలు చూసారని, గరిష్ట పెట్టుబడులు మహారాష్ట్ర వచ్చాయని చెప్పారు. కొత్త విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వచ్చాయని, డజను వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, 100 రైళ్లే స్టేషన్లను ఆధునీకరించామని తెలిపారు.

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలుస్తుందనడానికి ఈ సభకు భారీ స్థాయిలో తరలివచ్చిన ప్రజలే నిదర్శనం అని ప్రధాని మోదీ చెప్పారు. “బీజేపీ సంకల్ప పత్ర మేనిఫెస్టో, మహారాష్ట్ర అభివృద్ధికి గ్యారంటీ. దేశం మొత్తం ఒకే రాజ్యాంగం ఉండేలా చేయడానికి(ఆర్టికల్ 370 రద్దును ఉద్దేశించి) ఏడు దశాబ్దాలు పట్టింది. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలను మీరు అనుమతిస్తారా” అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

అందరూ ఒకటిగా కలిసుంటేనే క్షేమంగా ఉంటామని మరోసారి మోదీ తన నినాదాన్ని వినిపించారు. దేశంలో గిరిజన జనాభా సుమారు 10 శాతం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కమ్యూనిటీని కులాల పేరుతో విడగొట్టి బలహీనపరచాలని అనుకుంటోందని చెప్పారు. అంతర్గత పోరుతో గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందన్నారు. అదే జరిగితే గిరిజనుల ఐక్యత దెబ్బతింటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రిన్స్ (రాహుల్) ఇదే విషయాన్ని విదేశంలో ప్రకటించారని, కాంగ్రెస్ కుట్రలో మనం భాగం కారాదని, కలిసికట్టుగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.