
500 ఏళ్ల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో దివ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నభూతో అన్న విధంగా సాగింది. అయితే అప్పటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కాలేదు. అయోధ్య గర్భగుడి పనులు పూర్తి కావడంతో బాలరాముడి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు.
ఆ తర్వాత అయోధ్యలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ముందుగా నిర్ణయించిన ప్రకారం 2025 జూన్ నెల వరకు అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అయితే రామాలయ నిర్మాణ పనులు పూర్తి కావడానికి 3 నెలలు ఆలస్యం అవుతుందని అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆలయ శిఖర పనులు పూర్తి కావడానికి 3 నెలలు ఆలస్యం కానున్నట్లు కన్‌స్ట్రక్షన్ కమిటీ ఛైర్మన్ తెలిపారు.
2025 జూన్‌కు బదులుగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు పూర్తి కావడానికి 2025 సెప్టెంబర్ వరకు పూర్తి కానున్నట్లు నృపేంద్ర మిశ్రా పేర్కొన్నారు. నిర్మాణ కార్మికుల కొరత, బండల పని పూర్తి కాని నేపథ్యంలో ఆలయ శిఖర నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని చెప్పారు. కావాల్సిన కార్మికుల కంటే సుమారు 200 మంది కార్మికులు తక్కువ ఉన్నట్లు తెలిపారు.
ఇక అయోధ్య ఆలయంలోని మొదటి అంతస్థులో పెట్టాల్సిన బండలకు సంబంధించిన పనులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు నృపేంద్ర మిశ్రా చెప్పారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడానికి కార్మికులు తక్కువగా ఉండటమే కారణం అని వివరించారు. ఆలయ పరిసరాల్లోని ఆడిటోరియం, బౌండరీ ఇంకా నిర్మించాల్సి ఉందని తెలిపారు. అయోధ్యలో శుక్రవారం జరిగిన రామాలయ బిల్డింగ్ కమిటీ సమావేశంలో నృపేంద్ర మిశ్రా పాల్గొని ఈ విషయాలు వెల్లడించారు.
టెంపుల్ బౌండరీ కోసం 8.5 లక్షల క్యూబిక్ అడుగుల విస్తీర్ణంలో బాన్సి పహర్‌పుర్ రాళ్లను వాడనున్నట్లు చెప్పారు. అయితే ఆ రాళ్లు ఇప్పటికే అయోధ్యకు వచ్చినా కార్వింగ్ పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆలయ మొదటి అంతస్థులో సరిగా లేని రాళ్లను తీసి.. వాటి స్థానంలో మక్రానా రాళ్లను వేయనున్నట్లు తెలిపారు.
ఇక అయోధ్య రామాలయంలో ఏర్పాటు చేయనున్న అన్ని విగ్రహాలను రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్లు వివరించారు. రామ్‌లల్లాకు చెందిన మరో రెండు విగ్రహాలను కూడా ఆలయ పరిసరాల్లో ప్రతిష్ఠించనున్నారు. రామాలయం నుంచి భక్తులు.. బయటికి వెళ్లే అయ్యే దారిని మరింత వెడల్పు చేయనున్నట్లు నృపేంద్ర మిశ్రా చెప్పారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం