భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలను అధిగమించాలి!

భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలను అధిగమించాలి!

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధ ప్రయత్నాలకు సహకరించాయనే ఆరోపణలతో 19 భారతీయ కంపెనీలపై, ఇద్దరు భారతీయులపై అమెరికా గత అక్టోబర్ 30న ఆంక్షలు విధించింది. భారతీయ కంపెనీలతో పాటు మొత్తం 400 కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి విదితమే. 

రష్యాకు రక్షణ సామాగ్రిని సరఫరా చేస్తున్నాయనే నెపంతో భారత్‌కు చెందిన 19 కంపెనీలపై అమెరికా విధించిన ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించాల్సి ఉంటుందని స్వతంత్ర పరిశోధన సంస్థ గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) సూచించింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలకు సహకరిస్తున్నాయంటూ కంపెనీలపై అమెరికా ఏకపక్ష చర్యలకు దిగడంతో ఈ దిశగా భారత్‌ చేపట్టాల్సిన చర్యలను జీటీఆర్‌ఐ సూచించింది. 

ఆయా కంపెనీల ప్రయోజనాలను కాపాడటానికి వీలుగా అమెరికాతో, అంతర్జాతీయ సంస్థలతో భారత్‌ సంప్రదింపులు చేపట్టడం ద్వారా పరిష్కారాలు గుర్తించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఈ తరహా ఆంక్షలను నివారించడానికి వీలుగా ఎగుమతులకు సంబంధించి కఠిన నియంత్రణలు, స్పష్టమైన నిబంధనల అమలుకు చర్యలు తీసుకోవాలని జీటీఆర్‌ఐ కోరింది.

”యూఎస్‌ ఏకపక్షంగా ఆంక్షలు విధించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. తమ వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు వీలుగా భారత్‌ మాదిరి దేశాలు ఈ ఆంక్షలను జాగ్రత్తగా అధిగమించడమే వాస్తవిక కార్యాచరణ అవుతుంది. అమెరికా చర్యలు భారత వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగించినా లేదా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఐ) దృష్టికి భారత్‌ తీసుకెళ్లాలి” అని జీటీఆర్‌ఐ తన తాజా నివేదికలో సూచించింది.