ముడా స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను లోకాయుక్త పోలీసులు బుధవారం విచారించారు. ఈ కేసులో సిద్ధరామయ్య ఏ1గా ఉన్నారు. లోకాయుక్త పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు బుధవారం ఆయన విచారణకు హాజరయ్యారు. లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సిద్ధరామయ్యను రెండు గంటల పాటు విచారించింది.
ముడా స్థలాల కేటాయింపులో ఉన్న ఆరోపణలపై ప్రశ్నించింది. తన భార్య పార్వతికి 14 విలువైన స్థలాలను మైసూరు అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ(ముడా) కేటాయించడంలో సిద్ధరామయ్య పాత్రపై ప్రశ్నించినట్టు తెలుస్తున్నది. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న సిద్ధరామయ్య సతీమణి పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున స్వామితో పాటు దేవరాజు అనే వ్యక్తిని ఇప్పటికే లోకాయుక్త పోలీసులు విచారించారు.
మైసూరు సమీపంలోని ఓ గ్రామంలో దేవరాజు నుంచి మల్లికార్జున స్వామి భూమిని కొనుగోలు చేసి పార్వతికి బహుమతిగా ఇచ్చారని, తక్కువ విలువైన ఈ భూమిని ముడాకు అప్పగించి, ఖరీదైన 14 స్థలాలను పార్వతి పొందారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. కాగా, అసలు ముడాకు అప్పగించిన స్థలం దేవరాజుది కాదని, మల్లికార్జున స్వామి ఈ స్థలాన్ని కొనలేదనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘ప్రతీది(ముడా స్థల కేటాయింపు) న్యాయబద్ధంగా జరిగింది. బీజేపీ, జేడీఎస్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నాయి. లోకాయుక్త పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. నాపై తప్పుడు కేసు పెట్టారు. నేను నిజాలు చెప్పాను. నాపై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.’ అని పేర్కొన్నారు.
మరోవంక, సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీజేపీ నేతలు మైసూరులో ఆందోళనకు దిగారు. బీజేపీ ఎమ్మెల్యే టీఎస్ శ్రీవత్స నేతృత్వంలో బీజేపీ శ్రేణులు సిద్ధరామయ్య, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి, నినాదాలు చేశారు. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి, విచారణను ఎదుర్కోవాలని శ్రీవత్స డిమాండ్ చేశారు. ఆయన సీఎంగా ఉంటే విచారణ పారదర్శకంగా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. లోకాయుక్త పోలీసుల తీరుపై అనుమానం వ్యక్తం చేసిన ఆయన ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
More Stories
అమెరికా సుంకాలతో ప్రపంచ మార్కెట్లు కోల్పోకుండా వ్యూహం!
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ఊర్వశి, మిమి చక్రవర్తిలకు నోటీసులు
ప్రజల రోజువారీ జీవితంలో స్పష్టంగా జీఎస్టీ ప్రభావం