
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాణా సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర సింగ్ రాణా (59) గురువారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జితేంద్ర సింగ్ చిన్న సోదరుడైన దేవేంద్ర ఇటీవల జరిగిన జమ్మూ కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో నగ్రోటా స్థానం నుంచి విజయం సాధించారు.
జమ్మూ ప్రాంతంలోని ఆ స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి జోగిందర్ సింగ్‌పై 30,472 ఓట్లతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎన్సీ అభ్యర్ధిగా ఇదే స్థానం నుంచి దేవేందర్ గెలవడం విశేషం. డోగ్రా సామాజికి వర్గానికి చెందిన ఆయనకు బలమైన నేతగా గుర్తింపు ఉంది. దేవేంద్ర సింగ్‌కు భార్య, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి సహా ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఎన్సీలో ఉన్నప్పుడు ప్రస్తుత జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు ఆ పార్టీలో కొనసాగిన ఆయన చివరకు 2021లో ఎన్సీని వీడి బీజేపీలో చేరారు. దేవేందర్‌సింగ్ మృతిపై సీఎం ఒమర్ అబ్దుల్లా, లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం తనను ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరీ కూడా సంతాపం వ్యక్తం చేశారు. దేవేందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పీడీపీ అధ్యక్షురాలు, మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ దేవేంద్ర సింగ్ రాణా మరణం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఆయన కుటుంబానికి తన సంతాన తెలియజేశారు. బీజేపీ అధికార ప్రతినిధి సాజిద్ యూసఫ్ స్పందిస్తూ జమ్మూ కశ్మీర్‌లో రాణా ప్రముఖ రాజకీయ నాయకుడు, ఆయన అకాల మరణం బీజేపీ, ఆయన అనుచరులను దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు.
జమ్మూ కశ్మీర్ యూనివర్సిటీ మాజీ వైస్-ఛాన్సలర్ అమితాబ్ మట్టో ట్వీట్ చేస్తూ ఆయన మరణం చాలా బాధాకరమని, ఆయన చాలా విలువైన నాయకుడని పేర్కొన్నారు. సోదరుడి మరణవార్త తెలిసి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఢిల్లీ నుంచి జమ్మూ కశ్మీర్‌కు హుటాహుటిన చేరుకున్నారు. శుక్రవారం దేవేంద్ర సింగ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు