ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి 

ప్రధాని ఆర్దిక సలహా మండలి ఛైర్మన్ వివేక్ దేవరాయ్ మృతి 

ప్రధాని ఆర్డిక సలహా మండలి ఛైర్మన్, ప్రముఖ ఆర్థికవేత్త పద్మ శ్రీ వివేక్ దేవరాయ్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు 69 ఏళ్లు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 7 గంటలకు ఆయన మరణించినట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ తెలిపింది.

భారత ఆర్దిక వ్యవస్థకు ఆయన సేవలకు గుర్తుగా పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. భారత ఆర్ధిక విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆర్ధిక శాస్త్రానికి సంబంధించి పలు పుస్తకాలు, రచనలు చేశారు. పలు పత్రికలకు సంపాదకీయాలు కూడా రాశారు.  ఆయన కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీ, పూణెలోని గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌కి ఛాన్సలర్‌గా పనిచేశారు.

నవంబర్ 2004 నుంచి డిసెంబర్ 2009 వరకు నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికను సిఫార్సు చేసేందుకు జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కమిటీకి ఆయన ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. ఆయన రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు కూడా.  2014 నుంచి 2015 వరకూ భారతీయ రైల్వేలను పునర్నిర్మించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన హైపవర్డ్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. 5 జనవరి 2015న ఆయన నీతీ ఆయోగ్‌లో శాశ్వత సభ్యునిగా నియమితుడయ్యారు.

సెప్టెంబర్ 2017లో దెబ్రాయ్‌ ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. స్థూల అర్ధశాస్త్రం, పబ్లిక్ ఫైనాన్స్‌లో నిపుణులైన దేవరాయ్ ఆర్ధిక సంస్కరణలు, పరిపాలన, రైల్వేల గురించి విస్తృత అంశాలను చర్చించారు. వీటితో పాటు . మహాభారతం, భగవద్గీత, హరివంశం, వేదాలు, వాల్మీకి రామాయణం సహా శాస్త్రీయ సంస్కృతి గ్రంథాలను సంక్షిప్త రూపంలో ఆంగ్లంలోకి అనువదించారు. 1955 జనవరి 25 మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జన్మించిన వివేక్ దేవరాయ్ కలకత్తా, ఢిల్లీ యూనివర్సిటీల్లో అర్ధశాస్త్రంలో ఉన్నత విద్యను పూర్తిచేశారు.

కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అకడమిక్ కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ 1979 నుంచి 1984 వరకు విధులు నిర్వర్తించి, తర్వాత పుణే గోఖేల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి 1987 వరకు సేవలు కొనసాగించారు. అనంతరం ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్‌కు మారారు.  1993లో ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం, కేంద్ర ఆర్దిక శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన న్యాయపరమైన సంస్కరణల కోసం కృషిచేశారు.

ఎకనమిక్ అఫైర్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రిసెర్చ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌టెంపరరీ స్టడీస్‌లోనూ వివిధ పదవులు చేపట్టారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో కలిసి 2006 వరకు పనిచేసి, తర్వాత కేంద్ర పాలసీ రిసెర్ఛ్ విభాగంలో చేరి 2007 నుంచి 2015 వరకు ఉన్నారు.

దెబ్రాయ్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దెబ్రాయ్‌ ఆర్థిక, చరిత్ర, సంస్కృతి, రాజీకాయలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాల్లో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. భారత ఆర్థిక విధానాల రూపకల్పనలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు. అంతేకాకుండా ప్రజా విధానానికి ఆయన చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.

‘డాక్టర్ వివేక్ దేవరాయ్ జీ ఒక ఉన్నతమైన పండితుడు. ఆర్థశాస్త్రం, చరిత్ర, సంస్కృతి, రాజకీయాలు, ఆధ్యాత్మికత ఒకటేమి విభిన్న రంగాలలో మంచి ప్రావీణ్య ఉంది. తన రచనల ద్వారా భారత మేధో దృశ్యంలో చెరగని ముద్ర వేశారు. ప్రజా విధానానికి ఆయన చేసిన కృషికి అతీతంగా మన ప్రాచీన గ్రంథాలపై పరిశోధనలు చేసి ఆనందాన్ని పొందారు. వాటిని యువతకు అందుబాటులో ఉంచారు’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.