
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులర్పించారు. గుజరాత్ కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా పరేడ్ నిర్వహించగా బలగాల నుంచి ప్రధాని గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారితో ప్రధాని ఐక్యతా ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత బలగాలు నిర్వహించిన కవాతుతో పాటు కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం వివిధ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కే చెందుతుంది.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఒకటైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సైనిక కవాతు నిర్వహిస్తుండగ ఈ సారి దేశం నలమూలల నుంచి 16 బృందాలు పాల్గొన్నారు.
సాయుధ దళాలు ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వహించాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సైనిక విమానం ఫ్లైపాస్ట్ చేస్తూ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించింది. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్‌ఎస్‌జీ, బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బృందాలు నిర్వహించిన ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ప్రధాని మాట్లాడుతూ దేశంలోని ఏకత్వాన్ని వల్లభ్‌భాయ్ పటేల్ రక్షించారని, పటేల్ అనేక తరాలకు స్ఫూర్తి కలిగిస్తున్నారని కొనియాడారు.
దేశమంతా ఒక్కతాటిపై ఉండాలని పటేల్ కోరుకునేవారని గుర్తు చేశారు. కొత్త లక్ష్యాల దిశగా భారత్ నిరంతరం ముందుకెళ్లాలని పటేల్ అనేవారని చెబుతూ మన ఉన్నతికి, వికాసానికి, ఉనికికి మూలం మాతృభాష అని ప్రధాని తెలిపారు. దేశ ఐక్యతను దెబ్బతీసేలా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా ప్రధాని మోదీ హెచ్చరించారు. ఐక్యత దెబ్బతీసే వారి కుట్రలు సాగనివ్వమని స్పష్టం చేశారు.
ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర పథకాలు అందరికీ అందిస్తున్నామని పేర్కొంటూ అర్హత ఉంటే చాలు కేంద్ర పథకాలు అందిస్తున్నామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక వన్ నేషన్, వన్ ట్యాక్స్ విధానం తీసుకువచ్చామని, అలాగే, వన్ నేషన్ – వన్ పవర్ విధానం, వన్ నేషన్ – వన్ రేషన్ విధానం తెచ్చామని, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానం తెచ్చేందుకు అడుగులు వేస్తున్నామని ప్రదాని వివరించారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దేశ వికాసానికి దోహం చేస్తుందని ప్రధాని అభిలాష వ్యక్తం చేశారు. ఏటా ఎన్నికలతో దేశ ప్రగతి కుంటుపడుతోందని చెబుతూ దేశ ప్రగతికి అడ్డుగోడలా ఉందనే ఆర్టికల్ 370ని తొలగించామని గుర్తు చేశారు.
More Stories
ఎట్టకేలకు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన ఆఫ్ఘన్ మంత్రి!
`ఆపరేషన్ బ్లూ స్టార్’ పొరపాటు.. ఇందిరను కోల్పోవాల్సి వచ్చింది
భారత్ తో సంబంధం ఎంతో విలువైనదిగా భావిస్తున్న అమెరికా