జవాన్లకు మిఠాయి తినిపించిన ప్రధాని మోదీ

జవాన్లకు మిఠాయి తినిపించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జవాన్లతో కలిసి దీపావళి వేడకల్లో పాల్గొన్నారు. గురువారం దివాళి ఫెస్టివల్ సందర్భంగా ప్రధాని మోదీ జవాన్లకు మిఠాయిలు తినిపించారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న ప్రధాని అక్కడి కచ్‌ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) జవాన్లతో కలిసి దివాళి సంబరాలు జరుపుకున్నారు.  కచ్ లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశంలోని అంగుళం భూమి విషయంలో కూడా తమ ప్రభుత్వం రాజీ పడబోదని స్పష్టం చేశారు.

21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం సైన్యం, భద్రతా దళాలకు ఆధునిక వనరులను సమకూరుస్తోందని భరోసా ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక సైనిక దళాల్లో ఒకటిగా మన భారత సైన్యాన్ని నిలుపుతామని తెలిపారు. ఈ ప్రయత్నాలకు పునాది రక్షణ రంగంలో మనం సాధించిన స్వావలంబన అని పేర్కొన్నారు.  ‘‘నేడు మనం అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తున్నప్పుడు, మీరంతా ఈ కలను పరిరక్షిస్తున్నారు’’ అని ప్రధాని తెలిపారు.

సరిహద్దు పర్యాటకం జాతీయ భద్రతలో కీలకమైన అంశమని, దీనిని తరచుగా విస్మరిస్తున్నారని, ఈ ప్రాంతంలో కచ్ అందుకు అనువైన ప్రాంతమని ప్రధాని మోదీ తెలిపారు. సాయుధ దళాలే భారత దేశ బలమని నరేంద్ర మోదీ చెప్పారు.

‘‘ప్రపంచం మిమ్మల్ని చూసినప్పుడు భారత్ బలం కనిపిస్తుంది. మన  ప్రత్యర్ధులు మిమ్మల్ని చూసినప్పుడు, వారు వారి దురుద్దేశపూరిత ప్రణాళికలకు ముగింపును చూస్తారు. భారత్ తన సరిహద్దులలో ఒక్క అంగుళం విషయంలో కూడా రాజీపడబోదు. అందుకే మన విధానాలు మన సాయుధ దళాల సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ భారతీయ సైనికులతో స్పష్టం చేశారు.

కచ్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద గస్తీ కాస్తున్న జవాన్లకు ప్రధాని బీఎస్‌ఎఫ్ యూనిఫాం ధరించి మిఠాయిలు తినిపించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, ప్రతి సంవత్సరం దీపావళి పండగను పురస్కరించుకుని దేశ సరిహద్దులో జవాన్లతో కలిసి వేడుకలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

అంతకుముందు, దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “దీపావళి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు. ఈ దివ్య దీపాల పండుగ సందర్భంగా, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, సంతోషకరమైన, సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మా లక్ష్మి, శ్రీ గణేశుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని ఎక్స్ లో పోస్ట్ చేశారు.