రాయలసీమలో 54 కరువు మండలాలు ప్రకటన

రాయలసీమలో 54 కరువు మండలాలు ప్రకటన
రాయలసీమలోని 54 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో అతి స్వల్ప వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయశాఖ కరువు నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికల (పంట నష్టం 33 శాతం, అంతకంటే ఎక్కువ) ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన 54 మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర కరువు, మరో 27 మండలాల్లో మధ్యస్థ కరువు నెలకొన్నట్లు పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో 2, అనంతపురం 7, శ్రీసత్యసాయి 10, అన్నమయ్య 19, చిత్తూరు 16 మండలాల్లో కరువును ప్రకటించారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ విడుదల చేసిన ప్రకటనలో నైరుతి రుతుపవనాల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 574.7 మిల్లీమీటర్లు ఉండగా, 681.6 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసిందని, అయినప్పటికీ కొన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, డ్రైస్పెల్‌ నమోదైందని వివరించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనా కొన్ని మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు సిసోడియా తెలిపారు.  కరువు ప్రభావిత జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదు అయ్యింది.
2023 ఖరీఫ్‌లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. 2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 466 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు ఉంటే కేవలం 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా 82 శాతం విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.