సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ మళ్లీ బెదిరింపులు ​

సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ మళ్లీ బెదిరింపులు ​
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్​కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2 కోట్లు ఇవ్వాలని, లేదంటే సల్మాన్ ఖాన్​ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు. దీంతో వర్లీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. లారెన్స్‌బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చేతిలో హత్యకు గురైన బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్‌సిద్ధిఖీని చంపేస్తామని బెదిరించిన 20ఏళ్ల గుఫ్రన్‌ను అరెస్టు చేసిన కాసేపటికే ఈ పరిణామం జరిగింది.

తమకు రూ.5 కోట్లు ఇవ్వాలని, లేదంటే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ఎన్​సీపీ నాయకుడు జీషన్ సిద్ధిఖీని చంపేస్తామని ఇటీవల బెదిరింపులకు దిగాడు ఓ వ్యక్తి. ఈ ఘటనపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నోయిడాలో కాల్ చేసి బెదిరింపులకు పాల్పడిన నిందితుడు గుఫ్రన్ ఖాన్​ని మంగళవారం అరెస్టు చేశారు.

అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సల్మాన్ ఖాన్​ను చంపేస్తామని మరోసారి బెదిరింపులు రావడం గమనార్హం. గతంలోనూ సల్మాన్ ఖాన్​కు పలుమార్లు బెదిరింపులు వచ్చాయి. తాము కోరిన డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్ చంపేస్తామని హెచ్చరించారు దుండగులు.

కొన్నాళ్ల క్రితం కూడా సల్మాన్‌ ఖాన్‌ను చంపుతామని ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు సందేశం పంపిన షేక్‌ హుస్సేన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సైతం పలుమార్లు సల్మాన్ ను హతమారుస్తామని హెచ్చరించింది. గతేడాది రెండుసార్లు సోషల్ మీడియా, ఈ-మెయిల్స్ ద్వారా సల్మాన్​​కు బెదిరింపు హెచ్చరికలు పంపింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.

చివరిసారిగా 2023 నవంబర్​లో​ ‘మరణానికి వీసా అవసరం లేదు’ అంటూ సల్మాన్​ను హెచ్చరించింది. తమకు పూజ్యనీయమైన కృష్ణజింకలను వేటాడినందుకు సల్మాన్‌ ఖాన్‌ను చంపుతామని ఇప్పటికే ప్రకటించింది. బిష్ణోయిల మందిరానికి వెళ్లి క్షమాపణలు చెబితే వదిలేస్తామని స్పష్టం చేసింది.  ఇటీవలే ఎన్​సీపీ నేత, సల్మాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. అలాగే సల్మాన్​కు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని పలువురికి బెదిరింపు సందేశాలు పంపింది.