డిజిటల్ మోసాలకు రూ.120 కోట్లు నష్టపోయిన భారతీయులు

డిజిటల్ మోసాలకు రూ.120 కోట్లు నష్టపోయిన భారతీయులు

భారతీయులు డిజిటల్ అరెస్ట్ మోసాల ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ (మొదటి త్రైమాసికం) మధ్య రూ.120.3 కోట్లను నష్టపోయారని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ట్రేడింగ్, పెట్టుబడులు, డేటింగ్ యాప్ వంటి మోసాలన్నీ కలిపితే ఆ మొత్తం రూ.1,776కోట్లు వరకు ఉంటుందని తెలిపింది. సైబర్ నేరగాళ్లలో 46 శాతం మంది యమన్మార్, లావోస్, కంబోడియాకు చెందినవారేనని నివేదికలో స్పష్టం చేసింది.

బాధితులు ట్రేడింగ్ స్కామ్లలో రూ.1,420.48 కోట్లు, పెట్టుబడి మోసాలలో రూ.222.58 కోట్లు, డేటింగ్ స్కామ్లలో రూ.13.23 కోట్లు కోల్పోయారు. మయన్మార్, లావోస్, కంబోడియాకు చెందిన సైబర్ నేరగాళ్లు మోసపూరిత వ్యూహాలను ఉపయోగించి భారతీయులను టార్గెట్ చేస్తున్నారని ఇండియన్‌ సైబర్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.

ఉపాధి అవకాశాలను ఇస్తామని సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.  కాగా, సైబర్‌ క్రైమ్‌కు సంబంధించి ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ నెలల మధ్య కాలంలో 7.4 లక్షల ఫిర్యాదులు వచ్చాయని నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సిఆర్‌పి) డేటా వెల్లడించింది. 2023 సంవత్సర కాలంలో 15.56 లక్షల ఫిర్యాదులు, 2022లో 9.66 లక్షల ఫిర్యాదులు అందాయని ఎన్‌సిఆర్‌పి డేటా తెలిపింది.