విద్యుత్ చార్జీల పెంపుదల తిరస్కరించిన ఈఆర్సీ

విద్యుత్ చార్జీల పెంపుదల తిరస్కరించిన ఈఆర్సీ

విద్యుత్ వినియోగ చార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) తిరస్కరించింది. 300 యూనిట్లు దాటితే 10 నుంచి 50 శాతానికి ఫిక్స్‌డ్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కంలు ఈఆర్సీ ముందు ప్రతిపాదన చేశాయి. సుదీర్ఘ చర్చల అనంతరం డిస్కంల ప్రతిపాదనను ఈఆర్సీ తిరస్కరించింది.

డిస్కమ్‌లు చేసిన 8 ప్రతిపాదనలపై తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశామని తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు తెలిపారు. సోమవారం పొద్దుపోయిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయనే వివరాలతో డిస్కంలు ఈఆర్సీకి తాజాగా నివేదికను అందజేశాయని వెల్లడించారు. 300 యూనిట్ల పైబడిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు పెంచాలని వచ్చిన ప్రతిపాదనను తిరస్కరించామని, అయితే 800 యూనిట్లపై బడిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు పెంచేందుకు అంగీకరించామని తెలిపారు.

విద్యుత్ చార్జీలు ఏ కేటగిరిగిలో కూడా పెంచడం లేదని స్పష్టం చేశారు. పౌల్ట్రీ ఫామ్, గోట్ ఫామ్‌లకు రూ.100 పెంచాలని ప్రతిపాదనలు వచ్చాయని దాన్ని ఆమోదించలేదని చెప్పారు. పరిశ్రమలకు ఎల్‌టి3 150 ఫిక్స్‌డ్ చార్జీలు పెంచాలని డిస్కమ్‌ల నుంచి ప్రతిపాదన వచ్చిందని దాన్ని 100కు కమిషన్ పరిమితం చేసిందని తెలిపారు. హెచ్‌టి కేటగిరిలో విద్యుత్ చార్జీల పెంపునకు తిరస్కరించామని చెప్పారు. 132 కెవిఏ, 33 కెవిఏ, 11 కెవిఏ కేటగిరీల్లో గతంలో ఎలా ఉన్నాయో అదే మాదిరిగానే విద్యుత్ చార్జీలు ఉంటాయని చైర్మన్ స్పష్టం చేశారు.

స్థిర చార్జీలు రూ.10 యాదాతధంగా ఉంటుందని. చార్జీల సవరింపు వల్ల వినియోగదారులపై ఐదు నెలల కాలానికి రూ.30 కోట్ల భారం పడుతున్నందున డిస్కంల ప్రతిపాదనలను ఆమోదించలేదని వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.270 ఫిక్స్‌డ్ చార్జీలను పెంచాలని వచ్చిన ప్రతిపాదనను ఆమోదించామని తెలిపారు. డొమెస్టిక్ కేటగిరీ 1 హార్టికల్చర్ వంటి వాటిని 15 హెచ్‌పి నుంచి 20 హెచ్‌పికి పెంచామని, ఎల్‌పి ఈవి ఛార్జింగ్‌లపై ఎలాంటి చార్జీలు ఉండవని కమిషన్ చైర్మన్ స్పష్టం చేశారు.

లిఫ్ట్ ఇరిగేషన్‌కు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు నాన్ పీక్ ఆవర్‌లో రూపాయి నుంచి 1.50 రాయితీ పెంచామని, టైమ్ ఆఫ్ డే లో పీక్ అవర్‌లో ఎలాంటి మార్పు చేయలేదని వివరించారు. చేనేత కార్మికులకు హర్స్ పవర్‌ను పెంచామని చెబుతూ పది హెచ్‌పి నుంచి 25 హెచ్‌పికి పెంచేందుకు ఆమోదించినట్లు ఈఆర్సీ చైర్మన్ స్పష్టం చేశారు. కాగా గ్రిడ్ సపోర్ట్ చార్జీలను కమిషన్ ఆమోదించిందని తెలిపారు.

అలాగే రూ.11,499.52 కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చిందని చెప్పారు. డిస్కంలు రూ.57,728.90 పిటిషన్ వేస్తే కమిషన్ రూ.54,183.28 కోట్లు ఆమోదించిందని తెలిపారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రూ. 25 వేల కోట్లు రావాల్సి ఉందని, డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు ప్రభుత్వ సంస్థల నుంచి రప్పించుకోగలిగితే నష్టాల నుంచి బయటపడతాయని నియంత్రణ మండలి సూచించిందని చైర్మన్ శ్రీరంగరావు చెప్పారు.రెవెన్యూ పై ట్రూ అప్ చార్జీల భారం పడకుండా, ఏ కేటగిరీకి కూడా విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతించలేదని వెల్లడించారు.