జన్వాడ ఫామ్ హౌస్ కేసులో డీజీపీకి కేసీఆర్ ఫోన్

జన్వాడ ఫామ్ హౌస్ కేసులో డీజీపీకి కేసీఆర్ ఫోన్

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాయదుర్గం ఓరియన్‌ విల్లాస్‌లోని రాజ్‌ పాకాల సోదరుడు శైలేందర్ విల్లాలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేశారు. అంతకు ముందు పోలీసులు, బిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

విల్లాలోకి వెళ్తున్న ఎక్సైజ్‌ పోలీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సెర్చ్‌వారెంట్‌ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు మాగంటి గోపీనాథ్‌, వివేకానంద, బాల్క సుమన్‌ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేశారు.

జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వివాదంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆరా తీశారు. డీజీపీ జితేందర్ కు కేసీఆర్ ఫోన్ చేశారు. కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల, ఆయన సోదరుడు శైలేందర్ ఇళ్లలో తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు ఇళ్లలో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. వెంటనే తనిఖీలు ఆపాలని డీజీపీని కోరారు.

కాగా, తన బావమరిది ఇంట్లో జరిగిన ఫ్యామిలీ దావత్‌ను రేవ్‌ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మధ్యే జన్వాడలో తాను ఒక ఇల్లు కట్టుకున్నాడని, ఇండ్లల్లోకి వెళ్లినప్పుడు అందర్నీ పిలవలేదని దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడని అని చెప్పారు. కానీ కొంతమంది దాన్ని రేవ్‌ పార్టీ అని సోషల్‌మీడియాలో ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేక రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. జన్వాడలో ఏం దొరకలేదని గచ్చిబౌలిలో రాజ్ పాకాల ఇంట్లో సెర్చ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి, కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొన్నారు.

“కేటీఆర్ రేవంత్ ప్రభుత్వంపై ఉద్ధృతంగా ముందుకు వెళ్తున్నారు. అందుకే టార్గెట్ చేసి రచ్చ చేస్తున్నారు. రాజ్ పాకాల సొంత ఇల్లు కట్టుకుని గృహ ప్రవేశం చేసుకున్నారు. జన్వాడ ఫార్మ్ హౌస్ ఎక్కడ ఉంది రాజ్ పాకాల ఇల్లు ఎక్కడ ఉంది? కేటీఆర్ బావమరిది కాబట్టి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కానీ వ్యక్తిగత కక్షలు ఇవ్వాళ రాజకీయాల్లో చూస్తున్నాం” అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.

“వ్యక్తులు తమ ప్రత్యర్థులను నేరుగా ఎదుర్కోలేనప్పుడు, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ ను ఎదుర్కోలేకపోయింది అందుకే చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్‌ను అక్రమంగా అరెస్టు చేయడంతో సహా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార రాజకీయాలు, ఫిరాయింపు వ్యూహాలను నేను ఖండిస్తున్నాను. ఈ అరెస్టులతో రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కా దుకాన్’ పూర్తిగా బట్టబయలైంది”  అంటూ మాజీ మంత్రి టి హరీష్ రావు మండిపడ్డారు.