కేవలం 4 గంటల్లోపే శంషాబాద్ నుండి రైలులో వైజాగ్

కేవలం 4 గంటల్లోపే శంషాబాద్ నుండి రైలులో వైజాగ్

తెలుగు రాష్ట్రాల్లోని (ఏపీ, తెలంగాణ) ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించే ప్రాజెక్టు ప్రణాళిక కీలకదశకు చేరింది. శంషాబాద్‌-విశాఖ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ ట్రైన్ కారిడార్‌ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది. సూర్యాపేట, ఏపీలోని విజయవాడ మీదుగా ఈ మార్గాన్ని ప్రతిపాదించారు.

ఇందులో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్ను నిర్మించనున్నారు. ఇది ఏపీలోని విశాఖ నుంచి మొదలై సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు చేరుతుంది. వీటి ప్రిలిమినరీ ఇంజినీరింగ్, ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే చివరి దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబరులో రైల్వేబోర్డుకు సమర్పించనున్నట్లుగా సమాచారం.

తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ కారిడార్గా ఇదే కానుండటం విశేషం. ఈ రూట్లో శంషాబాద్, రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్లను అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించడం మరో విశేషం. విమాన ప్రయాణికులు సెమీ హైస్పీడ్‌ రైళ్లలో స్వస్థలాలకు త్వరగా చేరుకునేలా రైల్వేశాఖ ప్రణాళికను రూపొందించింది. 

గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్‌ (శంషాబాద్‌) ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్నానికి 4 గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య రైలు ప్రయాణం 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్‌ రైలు 8.30 గంటల్లో చేరుకుంటోంది.

సికింద్రాబాద్‌- విశాఖకు ప్రస్తుతం రెండు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. మొదటిది వరంగల్, ఖమ్మం, విజయవాడ రూట్, రెండోది నల్గొండ, గుంటూరు, విజయవాడ రూట్. ఈ మార్గాల్లో రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110-130 కిలోమీటర్లు మాత్రమే. ఈ రెండింటితో పోలిస్తే కొత్తగా రానున్న శంషాబాద్‌-విశాఖపట్నం మార్గం దగ్గరకానుంది. వేగం దాదాపు రెట్టింపై ప్రయాణ సమయం సగానికంటే గణనీయంగా తగ్గిపోతుంది.

విశాఖ- శంషాబాద్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ ప్రతిపాదిత మార్గంలో మరో కీలకాంశం కూడా ఉంది. విశాఖపట్నం నుంచి కర్నూలు వరకు అనుసంధానం రూట్ను సూర్యాపేట మీదుగా ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం 8 రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు.

శంషాబాద్‌- విశాఖ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ని పరిశీలిస్తే హైదరాబాద్‌- విజయవాడ 65 నేషనల్ హైవే మార్గానికి కాస్త అటూఇటూగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఇప్పటివరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలు కొత్త కారిడార్‌తో రైల్వే నెట్‌వర్క్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు ఇప్పటికీ రైలు మార్గం లేదు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ పట్టణాలకు కూడా రైల్వే మార్గం లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మొత్తంలో ఎక్కడా రైల్వే లైన్ లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకెళ్లే సెమీహైస్పీడ్‌ కారిడార్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.