కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ

కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన జన్వాడ లోని ఓ ఫార్మ్ హౌస్ లో రాజ్ పాకాల రేవ్ పార్టీ నిర్వహించినట్లు ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ రెవెన్యూ గ్రామ శివారులో గల ఓ ఫాంహౌస్‌లో శనివారం అర్ధరాత్రి నిర్వహించిన మందు పార్టీ కలకలం రేపుతోంది.
ఎటువంటి అనుమతి లేకుండా పార్టీ నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న ఎక్సైజ్, నార్సింగి, ఎస్వీటీ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు డయల్ 100కు కాల్ రాగా వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో తనిఖీలు చేపట్టగా.. భారీగా ఫారిన్ లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.

అక్కడ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు డ్రగ్స్ వాడినట్టు అనుమానం వచ్చింది. పార్టీలో పాల్గొన్న 24 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వారిలో విజయ్‌ మద్దూరి అనే వ్యక్తికి పాజిటివ్‌గా తేలింది. కొకైన్ తీసుకున్నట్లు పరీక్షలో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో 14 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

దాదాపు 30 ఎకరాల్లో ఈ ఫాంహౌస్ ఉంది. ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు రాజ్ పాకాలపై కేసులు నమోదు చేశారు. 10 లీటర్లకు పైగా అనుమతి లేని విదేశీ మద్యం, ఇండియన్ మేడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్ కార్డ్స్, పోకర్, క్యాసినో వంటి వాటిని గుర్తించారు. ఫాంహౌస్‌లో దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్  పోలీసులకు అప్పగించారు.

ఈ రేవ్ పార్టీపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీసీ పుటేజీ సహా ఇతర ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని పోలీసులను కోరారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాల్సిందేనని స్పష్టం చేశారు. రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరిని  అరెస్ట్ చేయాలని, చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యల ఉండాలని స్పష్టం చేశారు.

కాగా, ఇందులో కొందరు పెద్దలను తప్పించిన్నట్లు అనుమానాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ రఘనందన్ రావు ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంపై సిట్ వేయాలని డిమాండ్ చేశారు. విదేశీ మద్యం, కొకైన్ తెచ్చిన నగరంలో దందా చేస్తున్నారని చెబుతూ ఫాంహౌస్ సీసీ టీవీ ఫుటేజ్ బయటపెట్టి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.