వరుసగా రెండో నెలలోనూ భారీగా బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు

వరుసగా రెండో నెలలోనూ భారీగా బీఎస్ఎన్ఎల్ సబ్‌స్క్రైబర్లు
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత గత జూలైలో ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీచార్జీలు దాదాపు 25 శాతం పెంచేశాయి. దీంతో ప్రైవేట్ మొబైల్ ఫోన్ల యూజర్లు. సదరు ప్రైవేట్ టెలికం కంపెనీలకు రాంరాం చెప్పి ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు కలిసి వచ్చింది. 

భారీగా ప్రీ పెయిడ్ చార్జీలు పెంచిన ప్రైవేట్ టెలికం సంస్థలు ప్రతి నెలా సబ్ స్క్రైబర్లను భారీగా కోల్పోతుండగా, బీఎస్ఎన్ఎల్ మాత్రం కొత్త సబ్ స్క్రైబర్లను చేర్చుకోవడంలో ముందు వరుసలో నిలిచింది. మూడు ప్రైవేట్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు వరుసగా తమ యూజర్లను కోల్పోతున్నాయి.

జులైలో మార్కెట్ వాటాలో 7.59 శాతం సబ్ స్క్రైబర్లను పెంచుకున్న బీఎస్ఎన్ఎల్, గత ఆగస్టు నెలలో 7.84 శాతం వాటా పెంచుకోవడం గమనార్హం. ఆగస్టులో బీఎస్ఎన్ఎల్ ఎంచుకున్న సబ్ స్క్రైబర్ల సంఖ్య 25 లక్షలు పెరిగితే, అంతకుముందు జూలైలో 29.4 లక్షల మంది సబ్ స్క్రైబర్లు జత కలిశారని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.

ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ గత ఆగస్టు నెలలో 40 లక్షలు, భారతీ ఎయిర్ టెల్ 24 లక్షలు, వొడాఫోన్ ఐడియా 18.7 లక్షల యూజర్లను కోల్పోయాయి. అంతకు ముందు జూలైలో రిలయన్స్ జియో 7,58,463 మంది సబ్ స్క్రైబర్లు, భారతీ ఎయిర్ టెల్ 16,94,300 మంది, వొడాఫోన్ ఐడియా 14,13,910 మంది సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. మూడు ప్రైవేట్ టెలికం కంపెనీలు ఆగస్టు నెలలో 83 లక్షలు, జూలైలో 38.6 లక్షల సబ్ స్క్రైబర్లను కోల్పోయాయి.

ఇటీవలే బీఎస్ఎన్ఎల్ ఛార్జ్ ప్లాన్ల పెంపుపై కీలక ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచన లేదని తెలిపింది. దీంతో మరింత మంది ఈ నెట్‌వర్క్ వైపు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రయివేటు టెల్కోలు ఉచిత కాల్స్‌ పేరుతో తొలుత స్వల్ప ఛార్జీలతో మార్కెట్లోకి వచ్చి కాలక్రమేణ అమాంతం పెంచేశాయి.

కాగా.. బిఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇటీవల తన ఖాతాదారులకు బలమైన హామీ ఇచ్చింది. తమ సంస్థ భవిష్యత్తులో టారీఫ్‌లను పెంచే యోచనలో లేదని ఇటీవల నూతన లోగో ఆవిష్కరణ సమయంలో స్పష్టం చేసింది. దీంతో ప్రయివేటు టెల్కోల్లో మరింత గుబులు మొదలయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రయివేటు టెల్కోల ఖాతాదారుల వలస మరింత కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.