ఫలించిన బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం

ఫలించిన బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం
బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల పోరాటం ఫలించింది. ఎట్టకేలకు దిగొచ్చిన ప్రభుత్వంలో గతంలో ఇచ్చిన జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు స్పెషల్‌ అదనపు డీజీపీ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సెలవుల విషయంలో తెలంగాణ బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట లభించింది.
 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం ఉండేది. కానీ ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ నిబంధనలను మార్చి కొత్త లీవ్‌ మాన్యువల్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్త జీవోను విడుదల చేసింది.  దీని ప్రకారం ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లిన కానిస్టేబుళ్లు.. ఇకపై 26 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఈ మ్యాన్యువల్‌పై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రేవంత్‌ సర్కార్‌ దిగొచ్చి ఆ జీవోను తాత్కాలికంగా నిలిపివేసింది.
 
ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానం అమలు చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ బెటాలియన్‌ భార్యలు ఆందోళనకు దిగగా వారు శుక్రవారం  సచివాలయ ముట్టడి ప్రయత్నించగా అరెస్టులకి దారితీసింది. ఏక్ పోలీస్‌ విధానాన్ని అమలుచేసి తమ భర్తలకు ఒకే దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అది అమలయ్యే వరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 పోస్టింగ్ ఇవ్వాలని నినదించారు. 
 
ఒకే నోటిఫికేషన్‌, ఒకే పరీక్ష పెట్టినప్పుడు అందరికి ఒకేలా ఉద్యోగం ఉండాలి, కానీ తమ భర్తలకే ఎందుకు కుటుంబాలకు దూరంగా ఉండే విధంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున హైదరాబాద్‌ చేరుకుని సెక్రటేరియట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. తమ భర్తలను కూలీల కంటే హీనంగా చూస్తున్నారని.. వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మండిపడ్డారు.
 
బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబసభ్యులు చేస్తున్న ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. 
 
ఎదురించిన బెటాలియన్‌ కానిస్టేబుళ్ల భార్యలను, ఇతర కుటుంబసభ్యులను మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకుంటూ మరీ వాహనాల్లో తరలించారు. దీంతో సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.  బెటాలియన్‌ కానిస్టేబుళ్లను కూలీలకంటే దారుణంగా చూస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మట్టి, ఇటుకలు మోపిస్తున్నారని, గడ్డి తీసే పనులు చెప్తున్నారని వాపోయారు. రిక్రూట్మెంట్ విధానంలో ప్రత్యేక బలగాలుగా కొంతమంది ఉద్యోగులను తీసుకుంటారని, బెటాలియన్ల ఉద్యోగాలు చేయడం వల్ల తమ కుటుంబాలకు దూరమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.