
సుప్రీంకోర్టు తదుపరి ప్రధా న న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 51వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నవంబర్ 11న బాధ్యతలు చేపడుతారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ ప్రకటించారు. 2025 మే 13 వరకు అంటే సుమారు ఏడు నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఖన్నా పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫారసు చేశారు. దానిని ఆమోదించిన కేంద్రం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత ఢిల్లీ హైకోర్టు జడ్జిగా పనిచేసిన జస్టిస్ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. పలు కీలక తీర్పులు వెలువరించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని పేర్కొం టూ 2019లో రాజ్యాంగ ధర్మాసనం తరఫున తీర్పు రాశారు. అమీష్ దేవ్‌గన్ కేసులో విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణంలో చట్టపరంగా తగిన నిబంధనలు పాటించలేదంటూ అసమ్మతి తీర్పు రాసిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఆయన కూడా ఉన్నారు.
ఈవీఎం- వీవీప్యాట్ రసీదుల లెక్కింపు కేసును విచారించిన ధర్మాసనంలోనూ ఆయన ఉన్నారు. వీవీప్యాట్ స్లిప్‌లను 100 శాతం మేర లెక్కించాలన్న వినతిని తిరస్కరిస్తూ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. జస్టిస్ ఖన్నా 14 మే 1960 న ఢిల్లీలో జన్మించారు. న్యాయమూర్తుల కుటుంబం నుంచే వచ్చిన ఖన్నా విద్యాభ్యాసం ఎక్కువగా ఢిల్లీలోనే జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమితులైన విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం వెల్లడించారు. ‘‘భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించి, గౌరవనీయులైన రాష్ట్రపతి, గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తరువాత, 2024 నవంబర్ 11 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించడం సంతోషంగా ఉంది’’ అని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు