
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అల్లర్లు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే పడగొట్టడంతో పాటు ఆమెను కట్టుబట్టలతో దేశం విడిచి పారిపోయేలా చేశాయి. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి శాంతియుత పరిస్థితులు నెలకొంటున్న వేళ మరోసారి ఆ దేశంలో అగ్గిరాజుకుంది.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలన మరోసారి అక్కడి విద్యార్థులు రోడ్డెక్కారు. అయితే ఇందుకు కారణం అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా గురించి ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొనడమే. మంగళవారం రాత్రి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని సెంట్రల్ షాహీద్ మినార్‌లో విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు.
అక్కడి నుంచి బంగ్లాదేశ్ అధ్యక్షుడి భవనం అయిన బంగాబభన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు, సైన్యం రంగంలోకి దిగింది.
ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా లేఖను వెతికేందుకు ప్రయత్నించినా అది దొరకలేదని తెలిపారు. అయితే ఆమెకు రాజీనామా లేఖ రాసి ఇచ్చే సమయం లేకపోవచ్చు అని వెల్లడించారు. కానీ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు పొంతన లేకపోవడం బంగ్లాదేశ్ విద్యార్థులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది.
ఆగస్ట్ 5వ తేదీన షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందిన రోజు రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మహమ్మద్ షహబుద్దీన్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి లేఖను తనకు అందించారని, దాన్ని తాను తీసుకుని ఆమోదం కల్పించినట్లు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలోని న్యాయ శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్ అధ్యక్షుడు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు