
ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారిణి అనురాధ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె ఇంటలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వహించారు. 1987లో ఐపీఎస్ గా అనురాధ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2023లో తన విధుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.
ఏఆర్ అనురాధ ఏపీలో ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేసిన మొదటి మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో కూడా పనిచేశారు. 1987 బ్యాచ్‌కు చెందిన ఏఆర్ అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి. ఏపీపీఎస్సీ బాధ్యతలను అప్పగించే విషయంలో పలు పేర్లను పరిశీలించిన తర్వాత అనురాధ నియామకానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపింది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపించింది. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని, తమకుకావాల్సిన వారికి మేలు చేసేందుకు ఒకటికి మూడు సార్లు మూల్యంకనం చేశారని టీడీపీ పలుమార్లు ఆరోపించింది.
ప్రభుత్వం మారిన వెంటనే మరో ఏడాది పదవీ కాలం ఉన్నా సవాంగ్ ఏపీపీఎస్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత మూడు నెలలుగా ఏపీపీఎస్సీకి చైర్మన్ లేకుండా పోయింది. మరోవైపు కొత్త నోటిఫికేషన్లు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే ప్రకటించిన పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయి. మరి కొన్ని పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ