తెలంగాణాలో 563 పోస్టుల భర్తీ కోసం నేడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సోమవారం ప్రారంభమైంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను 31,383 మంది అభ్యర్థులు రాస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల గేట్లును అధికారులు మూసివేశారు. గ్రూప్-1 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగుతున్న ఈ పరీక్షల కోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతించారు.
కాగా, పరీక్షలు ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు వీటిని వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. మెయిన్స్ పరీక్షల నిర్వహణలో హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కోర్టు తెలిపింది. నవంబర్ 20లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
గ్రూప్ 1 మెయిన్స్ రిజర్వేషన్ల అమలు విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నేటి నుంచి గ్రూప్ 1పరీక్షల్ని నిర్వహించందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ దశలో పరీక్షలు వాయిదా వేయడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది.
నవంబర్ 20న తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనున్నందున వాయిదా వేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడున్న దశలో పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులు గందరగోళానికి గురవుతారని, ఈ పరిస్థితుల్లో వాయిదా వేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఒకటిన్నర తర్వాత ఏ ఒక్కరినీ అనుమతించబోమని అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని 46 పరీక్ష కేంద్రాల వద్ద ఆయా కమిషనర్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు.
163 సెక్షన్ విధించడంతో పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి ఉండేందుకు వీల్లేదు. ప్రతి పరీక్షాకేంద్రం వద్ద ఒక ఎస్సై ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ సహా మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్లు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఎగ్జామ్ రూం, పరిసర ప్రాంతాలను ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు.
పరీక్షలకు సంబంధించి రోజూ ప్రశ్నపత్రాలు, జవాబుపత్రాలను జీపీఎస్ ట్రాకింగ్ అమర్చిన వాహనాల్లో తరలించనున్నారు. దీంతో నిర్దేశిత మార్గాల్లోనే ఆ వాహనాలు ప్రయాణించేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు.
More Stories
అభ్యర్థుల ఎంపికకై ముగ్గురు సభ్యులతో బిజెపి కమిటీలు
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఛార్జీల పెంపు
ఆమెరికాలో కాల్పులు.. హైదరాబాద్‌కి చెందిన విద్యార్థి మృతి