ముడా స్కామ్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

ముడా స్కామ్‌లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు శనివారం సైతం కొనసాగాయి. ఈ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. సాక్షాత్తూ సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతికి ముడా ద్వారా 14 ప్లాట్లు కేటాయించారని, ఈ కేటాయింపుల్లో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలున్నాయి.
ఈ కేసులో ఈడీ శుక్రవారం ముడా కార్యాలయంపై దాడులు చేసింది. ఈ సందర్భంగా ఇతర వ్యక్తులను కార్యాలయ ఆవరణలోకి రాకుండా అధికారులు అడ్డుకున్నారు. మైసూర్‌లోని ముడా కార్యాలయం, తహసీల్‌ కార్యాలయం, నిందితుల స్థలాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ, సీఆర్‌పీఎఫ్‌ భద్రతా బృందం సోదాలు చేస్తోంది.  
 
ముడా కమిషనర్‌ ఏఎన్‌ రఘునందన్‌, కార్యదర్శి ప్రసన్న వీకే, ఇతర అధికారులను ఈడీ ప్రశ్నించింది. 40 మంది సీఆర్‌పీఎఫ్‌ దళాలు, నగర పోలీసులతో శుక్రవారం ముడా కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు ఈడీ తనిఖీలు చేపట్టింది. వాటిని శనివారం కూడా కొనసాగించింది.
 
భూసేకరణ, కేటాయింపు విధానాలపై ఆరా తీయాలని ఈడీ ముడాకు పలు లేఖలు పంపినప్పటికీ సంతృప్తికరమైన సమాధానం రాలేదని, ఆ తర్వాత దాడులు నిర్వహించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోకాయుక్త ఇటీవల దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకుని, సీఎం, ఇతరులపై కేసు నమోదు చేయడానికి ఈడీ సెప్టెంబర్ 30 న ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్) దాఖలు చేసింది.