పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. శనివారం జరిగిన ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం పేర్కొంది. దాడి జరిగిన సమయంలో నెతన్యాహు, ఆయన సతీమణి నివాసంలో లేరని వెల్లడించింది. హమాస్ అధినేత యాహ్యా సిన్వర్ మరణం తర్వాత ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
శనివారం ఉదయం లెబనాన్‌వైపు నుంచి డ్రోన్లు దూసుకొస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ సైరన్లు మోగాయి. మూడు డ్రోన్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. డ్రోన్లలో ఒకటి సిజేరియాలోకి భవనాన్ని ఢీకొట్టినట్లు తెలిపాయి. మరో రెండింటిని పేల్చివేసినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. మరోవైపు సిన్వర్ మృతి తర్వాత స్పందించిన హెజ్‌బొల్లా తమ పోరాట దశను మార్చేలా ప్రణాళికలు వేసుకున్నామని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులు తీవ్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం హైఫా నగరం సహా ఉత్తర ఇజ్రాయెల్ వైపు మొత్తం 55 క్షిపణులు దూసుకొచ్చినట్లు ఐడీఎఫ్ తెలిపింది. వందల వేల మంది ఇజ్రాయెలీలు సురక్షిత ప్రాంతాలకు బంకర్లలోకి వెళ్లిపోయినట్లు పేర్కొంది.
మరోవంక, పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఈ దాడిలో 33 మంది పాలస్తీనియన్‌లు దుర్మరణం పాలయ్యారు. మరో 80 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో 21 మంది మహిళలే ఉన్నారు. పరిస్థితిని బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నార్త్ గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై ఈ దాడి జరిగిందని గాజాలోని అధికారులు వెల్లడించారు. కాగా తాజా దాడిలో మరణించిన 33 మందితో కలిపి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు మొత్తం 42,500 మందికిపైగా పాలస్తీనియన్‌లు ప్రాణాలు కోల్పోయారు. మరో లక్ష మందికిపైగా గాయపడ్డారు. గాజాలోని హమాస్ మిలిటెంట్‌లే లక్ష్యంగా గత కొన్ని నెలల నుంచి ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.

More Stories
భారత్, అమెరికాల మధ్య 10 ఏళ్ల రక్షణ ఒప్పందం
చాబహార్ పోర్ట్‌పై అమెరికా ఆంక్షల నుండి తాత్కాలిక ఊరట
అమెరికాలో వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ రద్దు