* గవర్నర్ రవిని రీకాల్ చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్
తమిళనాడులో మరోసారి ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర వివాదం రేగింది. జాతీయ సమైక్యతను అవమానించిన రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రీకాల్ చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ హాజరైన ఒక కార్యక్రమంలో ఆలపించిన తమిళ రాష్ట్ర గీతంలో గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ‘ద్రవిడ’ అనే పదాన్ని పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు.
మరోవైపు స్టాలిన్ మాట్లాడిన తీరు విచారకరమని గవర్నర్ ఆర్ఎన్రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న గవర్నర్, తమిళనాడు రాష్ట్ర గేయాన్ని అవమాన పరిచినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి ఓ ముఖ్యమంత్రి ఆ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు చెప్పారు.
గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన చెన్నైలోని దూరదర్శన్ హిందీ మాస వేడుకలో తమిళనాడు రాష్ట్ర గేయాన్ని ఆలపిస్తూ అందులో ద్రవిడ అనే పదం ఉన్న వాక్యాన్ని గాయకులు దాటవేశారు. ఇది రాజకీయంగా దుమారం రేపి ముఖ్యమంత్రి స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
దేశ ఐక్యతను, తమిళనాడును అక్కడి ప్రజలను గవర్నర్ అవమానించారని సీఎం స్టాలిన్ ఆరోపించారు. జాతి ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఆయన్ను వెంటనే రీకాల్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. తన ఇష్టానుసారంగా నడుచుకునే వ్యక్తి ఆ పదవిలో ఉండేందుకు తగరని ఆర్ఎన్ రవి గవర్నరా లేక ఆర్యుడా అని ప్రశ్నించారు.
ఒకవేళ జాతీయ గీతంలో ద్రవిడ అనే పదం వస్తే ఇలానే వదిలేస్తారా? అని ప్రశ్నించారు. తమిళనాడు రాష్ట్ర గేయంలో ద్రవిడ పదం దాటవేతను ఏఐడీఎంకే అధినేత పళనిస్వామి ఖండించారు. అది పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ సహా పలు పార్టీలు కూడా తీవ్రంగా ఖండించాయి.
ఎక్స్ పోస్ట్‌లో, గవర్నర్ ఇలా స్పందించారు: “గౌరవనీయ ముఖ్యమంత్రి తిరు. @mkstalin ఈ సాయంత్రం ఒక పశ్చాత్తాపకరమైన ట్వీట్ చేశారు. అందులో ఆయన నాపై జాత్యహంకార వ్యాఖ్య చేశారు. తమిళ్ థాయ్ వాజ్తు పట్ల అగౌరవం చూపిస్తున్నాడని తప్పుడు ఆరోపణ చేశారు. అది ఆయనకు తెలుసు.నేను ప్రతి ఫంక్షన్‌లో పూర్తి తమిళ్ తాయ్ వాజ్తును పఠిస్తాను. భక్తితో, గర్వంగా, ఖచ్చితత్వంతో చేస్తాను”
ఈ వ్యవహారంలో గవర్నర్ తప్పేమీ లేదని పేర్కొంది ఆయన కార్యాలయం. కార్యక్రమంలో గేయాన్ని ఆలపించిన బృందం పొరపాటుగా పేర్కొంది. సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు చెప్పింది. గవర్నర్ కేవలం ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, గీతాన్ని ఆలపించిన ట్రూప్ ద్రవిడ పదాన్ని దాటవేసిందని వివరణ ఇచ్చింది. దీనిపై దూరదర్శన్ తమిళ్ క్షమాపణలు చెబుతూ గాయకుల పరధ్యానం కారణంగానే అది జరిగిందని పేర్కొంది. తమ కారణంగా గవర్నర్‌కు జరిగిన ఇబ్బంది పట్ల క్షమాపణలు కోరింది.
అంతకుముందు, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసం వేడుకలను భవిష్యత్తులో నిర్వహించొద్దని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. చెన్నై దూరదర్శన్ కేంద్రం స్వర్ణోత్సవాల సంబరాలతో కలిపి హిందీ మాసం వేడుకలను శుక్రవారం గవర్నర్ అధ్యక్షతన నిర్వహించారని తెలిపారు.
భారత రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. చట్టాలు చేయడం, న్యాయశాఖ, సమాచార సంబంధాలు వంటి అధికారిక ఉద్దేశాల కోసం మాత్రమే హిందీ, ఆంగ్ల భాషలను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీ మాసం వేడుకలు నిర్వహించడం ఇతర భాషలను తక్కువచేసే ప్రయత్నంగానే తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటివి కొనసాగించాలని అనుకుంటే, ప్రాంతీయ భాషలకూ మాస వేడుకలు చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!