
దేశాభివృద్ధికి, పేదలు, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మేరకు చండీగఢ్‌లో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ప్రధాని మోదీ ప్రకటించారు. “ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించాను. మేము సుపరిపాలన, ప్రజల జీవితాలను మెరుగుపరిచే మార్గాలపై విస్తృతంగా చర్చించాము. మా కూటమి దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు కట్టుబడి ఉంది” అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఈ సమావేశానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సహా 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 18 మంది ఉపముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ‘వికసిత్ భారత్’కు ప్రధాని మోదీని ‘కెప్టెన్’గా చంద్రబాబు అభివర్ణించారు. ‘‘మోదీ ఒక కెప్టెన్‌గా తన ఆలోచనలతో వికసిత్ భారత్ 2047 కోసం అడుగులు వేస్తున్నారు. ఆయనకు అండగా నిలుద్దాం. అంతా కలిసి భారతదేశాన్ని మరింత వికసిత్ భారత్‌గా మార్చుదాం’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఈ సమావేశం అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ పరిపాలన ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారని చెప్పారు. ప్రో-పీపుల్, ప్రో- గవర్నెన్స్ (పీ2జీ2) పాలనపై దృష్టిసారించాలని, దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లమన్నారని తెలిపారు.
“ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 17 మంది సీఎంలు, 18 మందిడి ప్యూటీ సీఎంలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో 6 ప్రతిపాదనలపై చర్చించి ఆమోదించారు. ప్రధాని విధానాల కారణంగా హరియాణాలో పార్టీ విజయంపై మొదటి ప్రతిపాదనను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే చేశారు. దానికి ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025లో ‘సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకోవాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరో ప్రతిపాదనను ప్రతిపాదించారు.” అని నడ్డా తెలిపారు.
“డిజిటల్ ఇండియాలో దేశం ఎలా పురోగమిస్తుందో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ చర్చించారు. భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ గురించి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ మాట్లాడారు. అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లో ‘ఏక్ పెద్ మా కే నామ్ (అమ్మ పేరు మీద ఒక మొక్క)’ను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.” అని జేపీ నడ్డా వివరించారు.
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు గురించి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ, “మాకు పూర్తి విశ్వాసం ఉంది, మేము మంచి పని చేసాము..సమావేశం చాలా బాగుంది, ప్రధానమంత్రి 4 గంటల సమయం ఇచ్చి అందరి మాటలు విన్నారు. తన మనసులో ఏముందో కూడా మాట్లాదారు. ఇప్పుడు అందరూ దాని ప్రకారం పని చేస్తారము” అని చెప్పారు.
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం