
బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. బాల్యంలో వివాహం చేస్తే, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే స్వేచ్ఛను హరించినట్లే అవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం శుక్రవారం మార్గదర్శకాలను జారీ చేసింది. తాము సూచించిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు బదిలీ చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చారు.
వ్యక్తిగత చట్టాలతో బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అడ్డుకోవద్దని అభిప్రాయపడింది. బాల్య వివాహాలు మైనర్లకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛను హరిస్తాయని పేర్కొంది. బాల్య వివాహాలు, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టి సారించాలని సూచించింది. నేరస్థులకు జరిమానా విధించాలని నిర్దేశించింది. “బాల్యవివాహాలను నివారించాలనే వ్యూహాలు వివిధ వర్గాలకు అనుగుణంగా ఉండాలి. బహుళ రంగాల మధ్య సమన్వయం ఉన్నప్పుడే చట్టం విజయవంతం అవుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులకు దీనిపై శిక్షణ సామర్థ్యాన్ని పెంచాలి. కమ్యూనిటీ ఆధారిత విధానాలు ఉండాలి” అని ధర్మాసనం పేర్కొంది.
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని 2006లో రూపొందించారు. ఈ చట్టాన్ని 1929 నాటి బాల్య వివాహ నిరోధక చట్టం స్థానంలో తీసుకొచ్చారు. బాల్య వివాహాల చట్టాల అమలు తీరును ప్రశ్నిస్తూ ఓ ఎన్జీవో వేసిన పిల్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. బాల్య వివాహం జరిపిన కేసుల్లో వ్యక్తులను శిక్షించినా.. పెద్దగా ఏమీ మార్పు జరగడం లేదని కోర్టు తెలిపింది. చట్టాలను అమలు చేయడం అంటే శిక్షించడమే కాదు అని కోర్టు పేర్కొన్నది. పీసీఎంఏ చట్టం అమలు విషయంలో వివిధ వర్గాల ప్రజల మద్య సహకారం అవసరం అని కోర్టు తెలిపింది.
More Stories
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్
బీజాపూర్ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు