కెనడా ఎలాంటి ఆధారాలను చూపించలేదు

కెనడా ఎలాంటి ఆధారాలను చూపించలేదు

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత ఏజెంట్ల ప్రమేయంపై నిఘా ఊహాగానాలే తప్ప బలమైన ఆధారాలు లేవని కెనడా పార్లమెంటరీ విచారణ కమిషన్‌ ముందు  కెనడా ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రూడో అంగీకరించడంతో ఈ వివాదంలో భారత్ వైఖరికి బలమైన మద్దతు లభించినట్లయింది.  తాము ఎప్పటినుంచో ఇదే చెబుతున్నామంటూ భారత విదేశాంగ శాఖ స్పందించింది.

ప్రధాని ట్రూడో తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ ఓ ప్రకటనను విడుదల చేశారు.

‘నిజ్జర్ హత్య కేసు గురించి మేం ఎప్పటి నుంచో చెబుతున్న విషయమే ఇప్పుడు రుజువైంది. భారత్‌పై, భారత దౌత్యవేత్తలపై కెనడా చేసిన తీవ్రమైన ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ కెనడా మాకు సమర్పించలేదని మేం చాలా రోజులుగా చెప్తున్నదే ఇవాళ రుజువైంది. భారత్‌ – కెనడా సంబంధాలు ఇంత తీవ్రస్థాయిలో దిగజారడానికి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోనే పూర్తి బాధ్యుడు’ అని జైశ్వాల్ స్పష్టం చేశారు.

నిజ్జర్‌ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసినప్పుడు తనవద్ద నిఘా సమాచారమే తప్ప పక్కా ఆధారాలేవీ లేవని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో బుధవారం అంగీకరించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ నిర్వహిస్తున్న కమిటీ ముందు ఆయన ఈ విషయాన్ని తెలిపారు.

ఇదే విషయాన్ని జీ20 సదస్సు ముగింపు సమయంలో భారత ప్రధాని మోదీ దృష్టికీ తీసుకెళ్లినట్లు ట్రూడో పేర్కొన్నారు. అయితే, కెనడాలో భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ప్రధాని మోదీ తనతో చెప్పారని చెప్పారు. కానీ, తమను విమర్శించే ధోరణి భారత్ అవలంబిస్తోందన్న విషయం జీ20 నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాతే అర్థమైందని ట్రూడో తెలిపారు.

నిజ్జర్‌ హత్యలో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పాత్ర ఉందని ట్రూడో చేసిన ఆరోపణలపై రణ్‌ధీర్‌ జైస్వాల్‌ స్పందించారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌, అతడి సంబంధాల గురించి తాము కొన్నేండ్ల క్రితమే కెనడాకు చెప్పామని, వారిని అరెస్టు చేసి, అప్పగించాలని కోరామని తెలిపారు. ఇటీవల కూడా మరోసారి కోరామని, అయినా కెనడా స్పందించలేదని పేర్కొన్నారు. భారత దౌత్యవేత్తలు కెనడియన్ల సమాచారాన్ని సేకరించి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చేరవేశారని ఇటీవల ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సందర్భంగా భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో మరోసారి అభ్యంతరకర ఆరోపణలు చేశారు. భారత ప్రధాని మోదీ నేతృత్వంలోని సర్కారుతో విభేదించే కెనడా వారి వివరాలను ఇక్కడి భారత దౌత్యవేత్తలు సేకరించి, ఉన్నతస్థాయిలోని వారికి, లారెన్స్‌ బిష్ణోయ్‌ వంటి నేరగాళ్ల ముఠాలకు చేరవేస్తున్నారని ఆరోపించారు