భద్రత, వాణిజ్యం, ఆరోగ్యంలలో సహకారం బలోపేతం 

భద్రత, వాణిజ్యం, ఆరోగ్యంలలో సహకారం బలోపేతం 
షాంఘై సహకార కూటమి (ఎస్‌సిఒ) అగ్ర నాయకుల రెండు రోజుల సదస్సు ఇస్లామాబాద్ లో బుధవారం ముగిసింది. భద్రత, వాణిజ్యం, ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మెరుగుపరచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు పెంపొందించుకో వాలని, వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించాలన్న దృఢ నిశ్చయాన్ని వారు పునరుద్ఘాటించారు.
రాజకీయాలు, భద్రత, వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడులు, సాంస్కృతిక, మానవతా సంబంధాలు వంటి రంగాల్లో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సభ్య దేశాల ప్రతినిధి బృందాల అధిపతులు పునరుద్ఘాటించారు. మనిషి, ప్రకృతి మధ్య సామరస్యపూర్వక సహజీవనాన్ని సాధించాలని, శాంతియుత, సురక్షితమైన సుసంపన్నమైన, పర్యావరణ పరంగా పరిశుభ్రమైన భూగోళం కోసం పాటుపడాలని ఎస్‌సిఓ పిలుపునిచ్చింది.
శాంతియుత ఆఫ్ఘనిస్తాన్‌ కోసం పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీప్‌ పిలుపునిచ్చారు. ఏ దేశంపైన హింసకు దాని భూ భాగాన్ని ఉపయోగించరాదని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో షరీఫ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యతన సంతరించుకున్నాయి.  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ సమావేశానికి చైనా ప్రధాని లీ కియాంగ్‌, రష్యా ప్రధాని మిఖాయిల్‌ మిషుస్టీన్‌, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌, కిర్గిజిస్తాన్‌ , బెలారస్‌, కజకిస్తాన్‌, తజికిస్తాన్‌, మంగోలియా ప్రధానులు హాజరయ్యారు.
పటిష్టవంతమైన భద్రత కోసం పాకిస్తాన్‌ అదనపు పోలీసులను, దళాలను రాజధాని అంతటా మోహరించారు. సమావేశ స్థలి చుట్టూ పలు అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. దక్షిణ సింధ్‌ రాష్ట్ర రాజధాని కరాచీ విమానాశ్రయం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడిలో ఇద్దరు చైనీస్‌ ఇంజినీర్లు మరణించిన వారం రోజుల తర్వాత ఈ కూటమి సమావేశాలు ఇక్కడ జరుగుతుండడం గమనార్హం.
ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్‌లో చైనా నిధులతో చేపట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న చట్ట విరుద్ధమైన వేర్పాటువాద సంస్థ ఒకటి ప్రకటించింది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఈ సమావేశంలో మాట్లాడుతూ, చైనా బెల్ట్‌ అండ రోడ్‌ ఇనిషియేటివ్‌ , చైనా-పాకిస్తాన్‌ ఆర్థిక కారిడార్‌ విస్తరణ, రోడ్లు, రైల్వేలు, డిజిటల్‌ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ కింద చైనా ప్రపంచవ్యాప్తంగా పవర్‌ ప్లాంట్లు, రోడ్లు, రైల్వే మార్గాలు, ఓడరేవులను నిర్మిస్తోంది. దీనికి బెలారస్‌, ఇరాన్‌, కజకిస్తాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, పాకిస్తాన్‌, రష్యా నాయకులు, అధికారులు వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌ చొరవకు మద్దతు పునరుద్ఘాటించారని ఎస్‌సిఓ సంయుక్త ప్రకటన పేర్కొంది. షాంఘై సహకార కూటమి తదుపరి సమావేశం వచ్చే ఏడాది రష్యాలో జరుగుతుందని షరీఫ్‌ తెలిపారు.