
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ షాక్ తగిలింది. ఈ సంస్థ తాయరు చేస్తున్న బేబీ టాల్కమ్ పౌడర్‌తో క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని గత కొంత కాలంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పౌడర్‌ను వాడి తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందంటూ అమెరికాకు చెందిన ప్లాటికిన్ ఇవాన్ అనే వ్యక్తి స్థానిక ట్రయల్ కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు సంస్థకు పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. బాధితుడికి 15 మిలియన్ డాలర్లు అంటే రూ.126 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా అదనపు ఖర్చులు సైతం చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. బేబీ టాల్కం పౌడర్‌కు పెట్టింది పేరుగా 1984 నుంచి జాన్సన్ అండ్ జాన్సన్‌కు ప్రచారం లభించింది.
అయితే, జాన్సన్ టాల్కం పౌడర్‌లో క్యాన్సర్ కారక ఆస్‌బెస్టాస్ అవశేషాలు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. జాన్సన్ జాన్సన్ టాల్కం పౌడర్ వల్లే క్యాన్సర్ బారిన పడ్డామని బాధితులు, మృతుల బంధువుల న్యాయస్థానాల తలుపు తట్టారు. ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ 2018లో వెలువరించిన పరిశోధన నివేదిక కూడా తమ టాల్కం ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక ఆస్‌బెస్టాస్ ఉందని తొలి నుంచి జాన్సన్ జాన్సన్‌కు తెలుసునని పేర్కొన్నది.
అయితే, తొలి నుంచి తమ టాల్కం పౌడర్‌పై వచ్చిన ఆరోపణలను జాన్సన్ జాన్సన్ ఖండిస్తూనే వస్తోంది. తమ ఉత్పత్తులు సురక్షితం అని, ఆస్‌బెస్టాస్ రహితమని వాదిస్తున్నది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లలో బాధితులకు అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పుల వల్ల జాన్సన్ అండ్ జాన్సన్ 22 మంది మహిళలకు 200 కోట్ల డాలర్లకు పైగా పరిహారం కూడా చెల్లించింది.
దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ టాల్కం పౌడర్ విక్రయాలను నిలిపేయాలని కోరుతూ పలువురు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారు. ఇక ఈ వివాదాల నేపథ్యంలో మూడేళ్ల క్రితమే అమెరికా, కెనడాల్లో బేబీ టాల్కం పౌడర్ ఉత్పత్తి, విక్రయాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది.
More Stories
40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ