
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు 45 మందిపై బంగ్లాదేశ్ ఇంటర్నేషన్ క్రైమ్ ట్రైబ్యునల్ గురువారం అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అరెస్టు వారెంట్లు జారీ అయిన వారిలో అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు సైతం ఉన్నారు. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో జరిగిన మారణహోమం, ఇతర నేరారోపణలపై క్రైమ్ ట్రైబ్యునల్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ మహ్మద్ గోలం ముర్తాజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. నవంబర్ 18లోగా షేక్ హసీనా సహా మొత్తం 46 మందిని అరెస్ట్ చేసి హాజరుపరచాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సాగిన విద్యార్థి ఉద్యమం హింసాత్మకంగా సాగిన విషయం తెలిసిందే. ఉద్యమాన్ని అణిచివేసేందుకు షేక్ హసీనా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విద్యార్థి నేతలు ఆరోపించారు. హింసాత్మక ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనలు మరింత ఉధృతం కావడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చారు.
జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన బంగ్లా మారణకాండలో, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ఐసీటీ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్ ఇటీవల పేర్కొన్నారు. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలోనే ఈ తాజా ఆదేశాలను ఐసీటీ జారీ చేసింది.
ఆమె ప్రస్తుతం భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. హసీనా రాజీనామా తర్వాత నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మొహమ్మద్ యూనస్ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం విద్యార్థి ఉద్యమంలో హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నది.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్