
హరియాణా బీజేపీ శాసనసభాపక్ష నేతగా నాయబ్ సింగ్ సైనీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చండీగఢ్‌లో బుధవారం ఉదయం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు నాయబ్ సింగ్ సైనీకి శుభాకాంక్షలు తెలిపారు.
“నాయబ్ సింగ్ సైనీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హరియాణాలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 15 ఏళ్ల పాటు ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటుంది. మనోహర్ లాల్ ఖట్టర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయి. ఎన్నికల సమయంలో ఏ విషయాన్నీ ప్రతిపక్షం వదిలిపెట్టలేదు. అగ్నివీర్లకు సంబంధించి తప్పుడు ఊహాగానాలు సృష్టించింది. ప్రతి అగ్నివీర్‌కు పెన్షన్‌తో కూడిన ఉద్యోగాన్ని ఇస్తాం” అని అమిత్ షా హామీ ఇచ్చారు.
బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా ఎంపికైన తర్వాత నాయబ్ సింగ్ సైనీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై విశ్వాసం ఉంచారని తెలిపారు. అందుకే మూడోసారి బీజేపీ ప్రభుత్వానికి జై కొట్టారని చెప్పారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ దార్శనికతను ముందుకు తీసుకెళ్లమని సైనీ కోరారు. అనంతరం పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ జిలేబీ తినిపించారు.
చంఢీగడ్‌లో బుధవారం జరిగిన సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటు అనుమతి ఇవ్వాల్సిందిగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరారు నాయబ్ సింగ్ సైనీ. ఆ సమయంలో ఆయన వెంట అమిత్‌షాతోపాటు పలువురు నాయకులు కూడా ఉన్నారు.
మరోవైపు, నాయబ్ సింగ్ సైనీ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పలువురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెళ్లనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో హరియాణా ముఖ్యమంత్రిగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అందుకే సైనీనే రెండోసారి సీఎంగా కొనసాగించడానికి అధిష్ఠానం సుముఖత వ్యక్తంచేసింది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మొత్తం 90 స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఆ పార్టీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లకే పరిమితమైంది.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం