
* 90 శాతం అంగవైకల్యం.. పదేళ్లు జైలులో
కోనసీమలో ఓ సాధారణ కుటుంభంలో జన్మించిన ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాగా పరిచితులైన గోకరకొండ నాగసాయిబాబా (57) పదేళ్ల జైలు జీవితం నుండి నిర్దోషిగా తిరిగి వచ్చిన కొద్దీ రోజులకే గత శనివారం మృతి చెందటంను పలువురు `వ్యవస్తీకృత’ హత్యగా అభివర్ణిస్తుండగా, మరికొందరు తాను నమ్మిన తీవ్రవాద ఉద్యమాలలో ఆధిపత్య ధోరణులకు బలయ్యారనే వాదనలను లేవనెత్తుతున్నారు. ఎదేమైనా మన `చట్టబద్ధ పాలన’ పట్ల పలు మౌలిక ప్రశ్నలు ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
ఢిల్లీలోని రామ్ లాల్ ఆనంద్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ నిషేధిత మావోయిస్ట్‌లతో సంబంధాల ఆరోపణలపై కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు కొద్ది రోజుల ముందు నాటి యుపిఎ ప్రభుత్వ హయాంలో, హోమ్ మంత్రిగా సుశీల్ కుమార్ షిండే ఉన్న సమయంలో 2014 మే 9న అరెస్ట్ కు గురయ్యారు. ఆ సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఉన్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఆయనకు 2017లో జీవిత ఖైదు విధించింది. 2021లో ఆయనను ఉద్యోగం నుండి తొలగించారు. అయితే, అక్టోబర్, 2022లో బొంబాయి హైకోర్టు సాంకేతిక కారణాలపై ఆయనను విడుదల చేసింది. ఆయనను అరెస్ట్ చేసిన యూఏపీఏ కింద తగిన ఆమోదం లేదని పేర్కొన్నది.
అయితే, మార్చ్, 2024లో హైకోర్టు ఆయనపై చేసిన నేరారోపణలు కొట్టివేస్తూ విడుదల చేసింది.
ఈ చట్టం క్రింద అరెస్ట్ చేసేందుకు ఎటువంటి ప్రాతిపదిక లేదని పేర్కొంటూ ఉగ్రవాద ఘటనలతో ఆయనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంబంధం ఉన్నట్లు, మద్దతు ఇచ్చినట్టు ఎటువంటి ఆధారాలు ప్రాసిక్యూషన్ చూపలేకపోయింది తెలిపింది. అయితే, ప్రాసిక్యూషన్ కథనం మేరకు పలు తీవ్రవాద కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొన్నారు.
ముంబై రెసిస్టెన్స్ 2004లో, వరల్డ్ సోషల్ ఫోరమ్‌కు సమాంతరంగా నిర్వహించిన 310 రాజకీయ ఉద్యమాల వేదికలో సాయిబాబా చురుకైన ఆర్గనైజర్‌గా పాల్గొన్నారు. ఈ కాలంలో, ఇంటర్నేషనల్ లీగ్ ఆఫ్ పీపుల్స్ స్ట్రగుల్ (ఇఎల్పీఎస్)లో భాగమయ్యారు.
2005లో, విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ 1992 ప్రకారం ఏపీ ప్రభుత్వం ఆగస్టు 2012లో నిషేధించిన రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డిఎఫ్)లో చేరారు. 2009లో, ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో, ప్రధానంగా భారత ప్రభుత్వం చేసిన సైనిక చర్యలకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ప్రముఖ స్వరంగా నిలిచారు.
జైలులో ఉండగా, వైద్య కారణాలతో జూన్ 2015లో బాంబే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో జూలై 2015లో విడుదలై, డిసెంబర్ 2015లో తిరిగి జైలుకు వెళ్లారు. సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడంతో ఏప్రిల్ 2016లో మళ్లీ విడుదలయ్యారు.
యుఏపిఎలోని సెక్షన్ 13, 18, 20, 38, 39, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం, నిషేధిత రివల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఆర్డిఎఫ్)తో సంబంధం ఉన్నందుకు మార్చి 2017లో సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, తాను నడిపిన సంస్థ నిషేధిత సీపీఐ-మావోయిస్ట్ ఫ్రంట్‌గా ఉందన్న ఆరోపణలను సాయిబాబా ఖండించారు.
కానీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో సిపిఐ-మావోయిస్ట్ పంపిణీ చేసిన బ్యానర్లు, కరపత్రాలతో సాయిబాబాకు జీవిత ఖైదు విధించడాన్ని నిరసిస్తూ మావోయిస్టులు 29 మార్చి 2017న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. 30 ఏప్రిల్ 2020న, ఐక్యరాజ్యసమితి ఓ హెచ్ సి హెచ్ ఆర్ తో కూడిన నిపుణుల బృందం ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని కోరుతూ భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.
సాయిబాబా ఆరోగ్య పరిస్థితుల కారణంగా. 28 జూలై 2020న, బాంబే హైకోర్టు సాయిబాబా దాఖలు చేసిన 45 రోజుల మెడికల్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. క్యాన్సర్‌తో మరణించిన తన 74 ఏళ్ల తల్లిని సందర్శించడానికి అనుమతి నిరాకరించింది. ఆమె మరణించిన తర్వాత అంత్యక్రియల ఆచారాలలో పాల్గొనడానికి కూడా అనుమతి నిరాకరించింది
22 అక్టోబర్ 2020న, సిసిటివి కెమెరాలకు సంబంధించిన తన డిమాండ్లను జైలు అధికారులు అంగీకరించడంతో సాయిబాబా తన నిరాహార దీక్షను విరమించారు. అక్టోబర్ 2022లో, సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు బెంచ్ 2017లో వారికి విధించిన జీవిత ఖైదును పక్కన పెట్టింది.
ఆరోగ్య సమస్యలపై తగు వైద్యం కోసం సాయిబాబా, ఆయన కుటుంబ సభ్యులు చేసుకున్న విజ్ఞప్తులను కోర్టులు, జైలు అధికారులు పట్టించుకోకపోవడంతో జైలులో ఆయన ఆరోగ్యం బాగా క్షీణించిందని, ఒక్కొక్క అవయవం పనిచేయడం మానేస్తూ వచ్చిందని చెబుతున్నారు. మొత్తం పక్రియ చట్ట ప్రకారమే జరిగింది. అయినా నిర్దుష్టమైన నేరారోపణలు లేకుండా పదేళ్లు జైలులో గడపవలసి రావడం, ఆ సమయంలో అసలే వైకల్యంతో బాధపడుతున్న ఆయన పలు ఆరోగ్యసమస్యలు గురై, చివరకు మరణానికి దారితీయడం గమనిస్తే మన వ్యవస్తీకృత లోపాలను వెల్లడి చేస్తుంది.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్